Chandrababu Review over AP Cyclone: ఆర్నబ్ తుఫాన్ దెబ్బ నుంచి ఏపీ వాసులు బయటపడకముందే దానికి మించిన రీతిలో మరో తుఫాన్ ప్రమాదం పొంచి ఉండటంతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన అధికారులను హుటాహుటిన పిలిపించి సమావేశం నిర్వహించారు. అర్నాబ్ తుఫాను తర్వాత ప్రజలు ప్రమాదం బారిన పడకుండా వేసిన ప్లాన్ ఇప్పుడు కూడా అమలు చేయాలని సూచించారు.

కొత్తగా వచ్చే తుఫాను నేపథ్యంలో చంద్రబాబు తన పర్యటనలను వాయిదా వేసుకున్నారు. రేపటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వర్షాలు ఏ మేరకు పడనున్నాయి, తుఫాన్ తీవ్రత ఎలా ఉండబోతోంది, గాలులు అంచనా, జలాశయాల నీటి మట్టాలు ఏ మేరకు ఉన్నాయి తదితర వివరాలు తెప్పించుకున్నారు.

వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని సీఎం కు అధికారులు తెలిపారు. తుఫాను నుంచి నవంబర్ 2 నాటికి తీవ్ర తుఫానుగా మారె అవకాశం ఉందని సంబంధిత అధికారులు సీఎం కు వివరించారు. నవంబరు 3న తెల్లవారుఝామున 5 గంటలకు బాపట్ల సమీపంలో తీవ్ర తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. అక్కడ గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. దీంతో నవంబరు 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురియనున్నాయి . నవంబరు 3, 4 తేదీల్లోఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బలమైన గాలుల వల్ల దాదాపు 15 వేల విద్యుత్ స్థంబాలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నవంబర్ 3 న ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, గుంటూరు, బాపట్ల లో వర్షపాతం ఎలా ఉండబోతోంది అధికారులు వివరించారు. నవంబర్ 3 న బుడమేరుకు సుమారు 32,500 క్యూసెక్కుల వరద ప్రవాహం రావచ్చని, ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర వాగుల్లో భారీ వరదకు అవకాశం ఉందని వెల్లడించారు.