అతి తీవ్రమైన తుఫాన్‌గా అర్నాబ్.. ఏపీకి రెడ్ అలర్ట్
Arnab Cyclone AP High Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ తీవ్రంగా మారింది. తుపాను కారణంగా ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

Arnab Cyclone AP High Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నాబ్ తుపాను (Arnab Cyclone) అతి తీవ్రమైన తుపానుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గత ఆరు గంటలుగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. ప్రస్తుతం విశాఖపట్నానికి (Visakhapatnam) ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 360 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 380 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పున 460 కిలోమీటర్లు, బాపట్లకు తూర్పున 530 కిలోమీటర్ల దూరంలో తుపాను కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, ఆ తర్వాత వాయువ్య దిశగా కదలనుంది. బుధవారం ఉదయం నాటికి బాపట్ల, విశాఖపట్నం (Visakhapatnam) మధ్య యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరాన్ని దాటే సమయంలోనూ అతి తీవ్రమైన తుపానుగా కొనసాగుతూ గంటకు 115 కి.మీ నుంచి 125 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కొన్నిసార్లు గాలి వేగం గంటకు 140 కి.మీ వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
తుపాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధం: హోంమంత్రి అనిత
అతి తీవ్రమైన తుపాను అర్నాబ్‌ను (Arnab Cyclone) ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని స్పష్టం చేశారు. SDRF, NDRF, పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ తదితర బృందాలను 24 గంటలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అవసరమైన ఏ క్షణంలోనైనా తీరప్రాంత ప్రజలను తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112ను సంప్రదించాలని హోంమంత్రి అనిత ప్రజలకు సూచించారు.
ఉప్పాడలో అల్లకల్లోలంగా సముద్రం
అర్నాబ్ తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ అలలు ఎగసిపడుతూ బీచ్ రోడ్డును బలంగా తాకుతున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలల నేపథ్యంలో పోలీసులు బీచ్ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. అర్నాబ్ తుపాను (Arnab Cyclone) ప్రభావం నేపథ్యంలో పర్యాటకుల భద్రత దృష్ట్యా విశాఖపట్నంలోని (Visakhapatnam) పలు పర్యాటక ప్రాంతాలను మూసివేయాలని వీఎంఆర్డీఏ నిర్ణయించింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో వీఎంఆర్డీఏ పరిధిలోని పర్యాటక ప్రాంతాలను మూసివేయనున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల పాటు కైలాసగిరి, తొట్లకొండ, వీఎంఆర్డీఏ పార్క్, సెంట్రల్ పార్క్‌లకు సందర్శకులను అనుమతించడం లేదని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌మెరైన్ మ్యూజియం, టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియం, సీ హారియర్ మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియంలను కూడా మూసివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పర్యాటకుల రక్షణే లక్ష్యంగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
అర్నబ్ తుఫాన్ (Arnab Cyclone) నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ సోమనాథన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు తుపానును సమర్థవంతంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలన్న చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటనలో పేర్కొన్నారు. నేవీ, ఎయిర్‌పోర్స్, NDRF దళాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మత్స్యకారులను రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు ఇవ్వాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం పాటు.. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సోమనాథన్ స్పష్టం చేశారు.



