ఆదర్శ కుటుంబంతో రికార్డులు బ్రేక్ చేసిన వెంకటేష్
Venkatesh Box Office Records: విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఆదర్శకుటుంబం హౌస్ నంబర్ 47 సినిమా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇండియాతో పాటు..ఓవర్సీస్లో సినిమా వసూళ్లు పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Venkatesh Box Office Records: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) హీరోగా వచ్చిన ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 (Adarsha Kutumbam)బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలైన మొదటి రోజే మంచి వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.16.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఓపెనింగ్‌తో 2026లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో ఏడో స్థానాన్ని దక్కించుకుంది. వెంకటేష్ (Victory Venkatesh) కెరీర్లోనూ బెస్ట్ ఓపెనింగ్ సినిమాగా నిలిచింది. సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే ప్రేక్షకులు మరోసారి వెంకీ కామెడీ టైమింగ్‌ను ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి త్రివిక్రమ్ తనదైన శైలిలో అందించిన డైలాగ్స్, హాస్యం తోడవడంతో థియేటర్లలో మంచి వినోదం పంచుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సన్నివేశాలు, సరదా సంభాషణలను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందనే టాక్ వినిపిస్తోంది.
సినిమాలో కొత్తదనం చూపించిన త్రివిక్రమ్
త్రివిక్రమ్ (Trivikram Srinivas) సినిమాల్లో కామెడీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈసారి తనదైన కామెడీకి క్రైమ్‌ను జోడించి AK 47తో కొత్త ప్రయత్నం చేశాడు. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వెళ్తే ఈ సినిమా డీసెంట్ ఎంటర్టైనర్గా అనిపిస్తుంది. దృశ్యం తరహా కథకు క్రైమ్ ఎలిమెంట్స్ జోడించినట్టుగా సినిమా సాగుతుంది. ఫస్టాఫ్ మొత్తం త్రివిక్రమ్ మార్క్ కామెడీతో సరదాగా సాగిపోతుంది. మధ్యమధ్యలో వచ్చే క్రైమ్ ఎపిసోడ్స్ ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది. అయితే సెకండాఫ్ మాత్రం కాస్త నెమ్మదిగా సాగుతుంది. కథలో పెద్దగా కదలిక లేకపోవడంతో స్క్రీన్‌ప్లేపై ఎక్కువ దృష్టి పెట్టాడు త్రివిక్రమ్ (Trivikram Srinivas). చివరి 15 నిమిషాల క్లైమాక్స్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు యాక్షన్ బ్లాక్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. నటీనటుల విషయానికి వస్తే వెంకటేష్ మరోసారి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ను అద్భుతంగా పండించాడు. త్రివిక్రమ్ తన రూట్ మార్చినా మాటల్లోని బలం మాత్రం తగ్గలేదు. ఓవరాల్‌గా కామెడీ, క్రైమ్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ AK 47 అని సినిమా విశ్లేషకులు అంటున్నారు.
20 ఏళ్ల తర్వాత కలిసి పని చేసిన వెంకీ- త్రివిక్రమ్
ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత వెంకటేష్ (Victory Venkatesh), త్రివిక్రమ్ (Trivikram Srinivas) కలిసి పనిచేయడం. అందుకే విడుదలకు ముందే ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక వెంకీకి జోడీగా శ్రీనిధి శెట్టి నటించగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్, వెన్నెల కిషోర్, సత్య, రావు రమేశ్, బ్రహ్మాజీ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. థమన్ అందించిన సంగీతం కూడా సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్లోనూ తొలి రోజు మంచి వసూళ్లు రావడం సినిమాకు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా వెంకటేశ్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ సంభాషణల శైలి ప్రేక్షకులను ఆకట్టుకుంటే రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
థియేటర్లలో బుకింగ్స్ ఫుల్
ఇక బుకింగ్స్ పరంగా కూడా ఈ చిత్రం మంచి జోరు చూపించింది. ప్రీమియర్ షోలతో పాటు తొలి రోజు అడ్వాన్స్ టికెట్ విక్రయాల్లో బ్లాక్ సీట్లను కలుపుకొని రూ.3.56 కోట్ల గ్రాస్ రాగా, వాటిని మినహాయిస్తే రూ.2.58 కోట్లుగా నమోదైంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన వసూళ్లతో పోలిస్తే తొలి రోజు కలెక్షన్లు నాలుగు రెట్లకు పైగా పెరగడం విశేషం. ప్రాంతాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచే సినిమాకు అత్యధిక ఆదరణ లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ.9.25 కోట్ల గ్రాస్ వసూలైంది. దేశీయ మార్కెట్లో వచ్చిన మొత్తం వసూళ్లలో ఈ రెండు రాష్ట్రాల వాటా సుమారు 83 శాతంగా ఉంది. ఇక కర్ణాటకలో రూ.1.40 కోట్లు, తమిళనాడులో రూ.30 లక్షలు, కేరళలో రూ.2 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.18 లక్షల గ్రాస్ వచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మొత్తానికి వెంకటేష్ (Victory Venkatesh) తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, త్రివిక్రమ్ శైలి సంభాషణలు, వినోదం సినిమాకు అదనపు బలంగా మారాయి. తొలి రోజు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం రానున్న రోజుల్లో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.



