Pawan Kalyan New Movie: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, సినిమాల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). తన అభిమానులను అలరించేందుకు వీలైనప్పుడల్లా సినిమాలకు సమయం కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) హీరోగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తెరకెక్కబోతోందనే వార్తలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dilraju) నిర్మాణంలో ‘అర్జున’ అనే సినిమా రూపొందనుందని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజీ’ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో దిల్ రాజు నిర్మాణంలో ‘అర్జున’ అనే మరో సినిమా చేయబోతున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడిగా అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్, వంశీ పైడిపల్లి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో కీర్తి సురేశ్, రుక్మిణీ వసంత్ కథానాయికలుగా నటించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇటీవల దిల్ రాజు (Dilraju) ‘అర్జున’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

పవన్‌తో దిల్ రాజుకు ప్రత్యేక అనుబంధం!

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన నాలుగో చిత్రం తొలిప్రేమ. 1998లో విడుదలైన ఈ సినిమాను నైజాం ప్రాంతంలో దిల్ రాజు పంపిణీ చేశారు. ఈ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకోవడమే కాకుండా, హైదరాబాద్‌లో 200 రోజుల పాటు ప్రదర్శితమై ఘనత సాధించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాను కూడా దిల్ రాజే (Dilraju) పంపిణీ చేశారు. ఈ చిత్రం పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. అలా పవన్ కళ్యాణ్ సినిమాల (Pawan Kalyan) డిస్టిబ్యూటర్‌గా పలు విజయాలను అందుకున్న దిల్ రాజుకు, ఆయనతో సినిమా నిర్మించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక వకీల్ సాబ్‌తో నెరవేరింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించేందుకు దిల్ రాజు ఆసక్తి చూపిస్తున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఒకవేళ ‘అర్జున’ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే, ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.

పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తారో..?

రాజకీయ బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన అభిమానుల కోసం సినిమాలు చేయడానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమయం కేటాయిస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలను పూర్తి చేశారు. మరోవైపు, ఓజీ సీక్వెల్‌ను తనే నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒకవేళ ‘అర్జున’ సినిమాకు అంగీకారం తెలిపినా, తన రాజకీయ, వ్యక్తిగత షెడ్యూల్‌కు అనుగుణంగానే డేట్స్ కేటాయించే అవకాశం ఉంది. గతంలో పవన్‌తో సినిమా నిర్మించి విజయాన్ని అందుకున్న అనుభవం దిల్ రాజుకు (Dilraju) ఉంది. కాబట్టి పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్‌ను ప్రారంభించేలా షెడ్యూల్స్‌ను సిద్ధం చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అర్జున సినిమాలో కీర్తి సురేష్, రుక్మిణీ వసంత్..?

అర్జున సినిమా గురించి వినిపిస్తున్న హీరోయిన్లు పేర్లు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కీర్తి సురేశ్, రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన కీర్తి సురేశ్ మరోసారి ఆయనతో జతకడతారా..? లేక కీలకమైన పాత్రలో కనిపిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే రుక్మిణీ వసంత్ పాత్ర ఎలా ఉండబోతోందన్న చర్చ కూడా మొదలైంది. అయితే సినిమాను త్వరలో సెట్స్‌ మీదకు తీసుకెళ్లేలా దిల్‌ రాజు (Dilraju) ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేయడంతో పాటు.. ఇటీవల విజయవాడలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) సమావేశమైనట్లు తెలుస్తోంది. అటు రాజకీయాలు, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చేలా సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ రాజకీయంగానే కాకుండా… సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తుండటంతో అభిమానుల్లో సంతోషం పెరిగింది..