బెజవాడ మేయర్ సీటుపై కూర్చునేది ఎవరూ..?
ABV vs Vangaveeti Radha: బెజవాడలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. జనసేన మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా పోటీ చేస్తున్నారు. కమ్మ, కాపు కులానికి చెందిన ఇద్దరు పోటీ చేయడంతో పొలిటికల్ హీట్ నెలకొంది.

ABV vs Vangaveeti Radha: బెజవాడలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. మేయర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష, స్వతంత్ర అభ్యర్థులు వ్యూహాలు రచించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల గురించి ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. అందులో ఒకరు వంగవీటి రాధా (Vangaveeti Radha) కాగా, మరొకరు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao). ఈ ఇద్దరు నేతలు విజయవాడ మేయర్ స్థానం కోసం పోటీ చేస్తున్నారు. వంగవీటి రాధా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా, ఏబీ వెంకటేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో విజయవాడ అంటే కుల రాజకీయాలకు పెట్టింది పేరు. వంగవీటి రాధా తండ్రి వంగవీటి రంగా కాపు నాయకుడిగా విజయవాడలో చెలామణి అయ్యారు. ఇక దేవినేని నెహ్రూ కమ్మ నాయకుడిగా ఉండేవారు. ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా పరిస్థితి ఉండేది. అయితే, చాలా కాలం తర్వాత ఇప్పుడు బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా
వంగవీటి రాధా.. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత వంగవీటి కుటుంబానికి బద్ధశత్రువుగా ఉన్న దేవినేని నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వంగవీటి రాధా (Vangaveeti Radha) ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరిన వంగవీటి రాధా.. 2014లో జగన్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వంగవీటి రాధా (Vangaveeti Radha) తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా, ఆయన ఆ పార్టీలోనే కొనసాగారు. 2024 ఎన్నికలకు ముందు వివాహం చేసుకున్న వంగవీటి రాధా.. ఎన్నికల సమయంలో చురుకుగా వ్యవహరించారు. కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. విజయవాడ మేయర్ స్థానాన్ని జనరల్ కేటగిరీకి కేటాయించడంతో టీడీపీని వీడి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో జనసేనలో చేరారు. జనసేన (Jansena) తరఫున విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
ఐపీఎస్ నుంచి రాజకీయాల్లోకి ఏబీవీ
కృష్ణా జిల్లాకు చెందిన ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ఐపీఎస్ (IPS) అధికారిగా తనదైన ముద్ర వేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. పదవీ విరమణకు సరిగ్గా ఒక రోజు ముందు జగన్ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఐపీఎస్ అధికారిగా పదవీ విరమణ పొందిన ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao). ఇప్పుడు విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పరిపాలనా రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చర్చల్లో నిలుస్తున్నారు. ఆయన రాజకీయ పాత్ర, స్థానికంగా ఆయనకు లభించే మద్దతు, వివిధ వర్గాలతో ఆయనకు ఉన్న సంబంధాలు వంటి అంశాలు మేయర్ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. బెజవాడలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతు ఇస్తారని, కాపు సామాజిక వర్గానికి చెందిన వారంతా వంగవీటి రాధాకు (Vangaveeti Radha) మద్దతు ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. వైసీపీ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ, పోటీ మాత్రం ఏబీ వెంకటేశ్వరరావు, వంగవీటి రాధా మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా, కుల సమీకరణాల అంశం ఇప్పుడు తెరపైకి రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.
మాజీ మేయర్‌ను బరిలో దింపిన వైసీపీ
వైసీపీ తరఫున గతంలో మేయర్‌గా పనిచేసిన రాయన భాగ్యలక్ష్మిని మరోసారి బరిలోకి దింపింది. తొలుత దేవినేని అవినాష్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తారని వైసీపీ (Ycp) నేతలు భావించారు. వంగవీటి రాధాకు ప్రత్యర్థిగా దేవినేని అవినాష్‌ను నిలబెడితే పోటీ హోరాహోరీగా ఉంటుందని వైసీపీ నేతలు (Ycp) జగన్‌కు సూచించినట్లు సమాచారం. కానీ, మాజీ సీఎం జగన్ మాత్రం మరోసారి నగరాల సామాజిక వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మికి అవకాశం కల్పించారు. విజయవాడలో నగరాల సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, మరోసారి ఆమె గెలుపు సులభమవుతుందని కొందరు చర్చించుకున్నారు. అయితే, స్వతంత్ర అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావు (Vangaveeti Radha), కూటమి తరఫున వంగవీటి రాధా పోటీ చేయడం రాజకీయంగా వేడిని పెంచింది. ఈ పరిణామాలన్నీ విజయవాడ రాజకీయాల్లో తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనే చర్చకు దారితీస్తున్నాయి.
మరోసారి ప్రపంచానికి బెజవాడ రాజకీయ చరిత్ర..!
మొత్తంగా చూస్తే.. విజయవాడలో మేయర్ ఎన్నికల చుట్టూ సాగుతున్న రాజకీయ చర్చ మరోసారి నగర రాజకీయ చరిత్రను గుర్తు చేస్తోంది. గతంలో వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ మధ్య సాగిన రాజకీయ పోటీ ఒక అధ్యాయమైతే, ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు, వంగవీటి రాధా పోటీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ ఎన్నికల్లో అసలు రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి..? ఎవరి వ్యూహాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి..? స్థానిక ప్రజల సమస్యలు ఎంతవరకు ప్రధానాంశాలుగా నిలుస్తాయి..? అన్నది రాబోయే పరిణామాలను బట్టి స్పష్టమవుతుంది. మరీ విజయవాడ ప్రజల కులసమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తారా..? లేకపోతే పార్టీలకు ప్రాధాన్యత ఇస్తారా..? అన్నది తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే..



