Vijay Rashmika: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల జీవితాలు ఒక ఓపెన్ బుక్‌లా మారిపోయాయి. అందులో మంచి కంటే చెడే ఎక్కువగా వైరల్ అవుతోంది. ఎలాంటి నిజం లేకుండా, అడ్డుగోలుగా చేసే పోస్టులు కొందరు సెలబ్రిటీలను ఎంతగా మానసిక క్షోభకు గురిచేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఇదే రకమైన దారుణమైన ట్రోలింగ్ ని ఎదుర్కొంటున్నారు టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika). ఏ ముహూర్తన ఈ జంట కాఫీ విత్ కరణ్ షోలో అడుగుపెట్టారో.. అప్పటి నుంచి ఈ ట్రోలింగ్ మొదలయ్యింది.

ఎంజాయ్ చేస్తున్న విజయ్‌- రష్మిక దంపతులు

విజయ్, రష్మిక వివాహం (Vijay Rashmika) తర్వాత ఎంతో సంతోషంగా తమ కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన రణబాలి సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ జంట బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కరణ్ జోహార్ హోస్ట్ చేసే పాపులర్ షో కాఫీ విత్ కరణ్‌కి వెళ్లారు. సినిమాల కంటే కూడా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించే ఎక్కువగా గెలుక్కొనే ఆ షోకి వీరు వెళ్లడమే పెద్ద తప్పు అయ్యింది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ షోలో కరణ్ అడిగిన ప్రశ్నలకు విజయ్, రష్మిక (Vijay Rashmika) ఇచ్చిన సమాధానాలే ఇప్పుడు వీరికి పెద్ద తలనొప్పిగా మారాయి. పెళ్లికి ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అని కరణ్ అడగగా.. విజయ్ తనదైన శైలిలో.. రష్మిక నన్ను వందసార్లు పెళ్లి చేసుకోమని బతిమలాడింది అని చెప్పారు. ఇక రష్మిక కూడా ఏడాది పొడుగునా అడిగి మరీ పెళ్లి చేసుకున్నా అని అన్నారు. ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఈ వ్యాఖ్యలను పట్టుకుని కొందరు నెటిజన్లు విజయ్‌ని రెడ్ ఫ్లాగ్ అంటూ తెగ ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆ ఇంటర్వ్యూ మొత్తం వీరిద్దరి మధ్య దూరం పెంచేలాగే ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది.

విజయ్‌ని ఫాలో కావడం లేదని సోషల్ మీడియాలో చర్చ

ఇదంతా అలా ఉంటే.. ఈ గొడవ సద్దుమనుగుతుంది అనుకునే లోపు మరో కొత్త రూమర్ తెరపైకి వచ్చింది. ఈమధ్య కాలంలో ఏ సెలబ్రిటీ జంట విడిపోయినా.. డైరెక్ట్ గా చెప్పకుండా ఇన్ స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో అయిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇన్ స్టాగ్రామ్‌లో రష్మికని (Rashmika) ఫాలో అవ్వడం లేదంటూ కొత్త రచ్చ మొదలుపెట్టారు. ఇంకేముంది.. ఈ ఒక్క చిన్న పాయింట్ పట్టుకుని సోషల్ మీడియాలో రకరకాల కథనాలు అల్లేసారు. విజయ్ – రష్మిక విడాకులు కూడా తీసుకుంటున్నారు అంటూ కొందరు సోషల్ మీడియాల్లో ప్రచారం చేయడం మొదలుపెట్టేశారు. పెళ్లి అయ్యి ఏడాది కూడా పూర్తి కాకముందే ఈ జంట విడిపోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలు చూసి సామాన్య ప్రజలు సైతం షాక్ అవుతున్నారు. అయితే, ఈ విడాకుల రూమర్స్ చూసి విజయ్, రష్మిక అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. విజయ్ – రష్మిక (Vijay Rashmika) విడిపోయే ప్రసక్తే లేదని, ఇవన్నీ కేవలం వ్యూస్ కోసం కొందరు సృష్టిస్తున్న వదంతులు మాత్రమే అని ఫ్యాన్స్ కొట్టిపారేశారు.

సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మిక

సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై రష్మిక (Rashmika) సుదీర్ఘ లేఖను విడుదల చేసింది. అందులో స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ప్రస్తుతం తాను, విజయ్ దేవరకొండ ఎంతో సంతోషంగా ఉన్నామని.. తమ బంధంపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని హితవు పలికారు. పెళ్లి అంటే ఉంగరాలు మార్చుకోవడం కాదని.. మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేయడం కాదన్నారు. జీవితాంతం కలిసి నడవడానికి ఒకరినొకరు ఎంచుకోవడం, దానికి ఇద్దరం సిద్ధంగా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి తగినంత సమయం తీసుకోవడం ముఖ్యమన్నారు. తాను, విజయ్ (Vijay Deverakonda) ఎన్నో ఏళ్లుగా ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. విజయ్ అంటే తనకు పిచ్చి ప్రేమ అని.. వందసార్లు కాదు, వెయ్యిసార్లు అయినా విజయ్‌నే భర్తగా ఎంచుకుంటానని అన్నారు. తమ బంధం గురించి మరోసారి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంతేకాదు, విజయ్, రష్మిక కలిసి సంతోషంగా ఉన్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. దీంతో ట్రోలర్స్‌కు చెంపదెబ్బ కొట్టినట్లయింది.