Tirumala Garuda Seva 2026: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ వాహన సేవ (Garuda Seva )శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా.. కన్నుల పండువగా జరిగింది. మలయప్ప స్వామి లక్ష్మీ కాసుల హారంతో అలంకృతుడై తిరుమాడ వీధుల్లో విహరించారు. గరుడ సేవ జరుగుతున్నప్పుడు తిరుమలలో భారీ వర్షం కురిసింది. అయినా భక్తులు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు.

శుక్రవారం రాత్రి 6.30 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కళాకారుల భజనల నడుమ గరుడ వాహనంపై శ్రీవారు తిరుమాఢ వీధుల్లో విహరించారు. భక్తులకు అభయం ఇచ్చారు. భక్తు జయజయధ్వానాల మధ్య సప్తగిరులు మార్మోగాయి. గరుడ వాహన సేవ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. గరుడ సేవలో పాల్గొన్న భక్తులకు టీటీడీ అడుగడుగున అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, బాదంపాలు అందించింది. టీటీడీ ఏర్పాట్లపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.