Konaseema Currency Ammavaru: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమలాపురం మెయిన్ రోడ్డులో కొలువై ఉన్న శ్రీవాసవి కన్యాకపరమేశ్వరి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీమహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా నాలుగున్నర కోట్ల కరెన్సీతో అమ్మవారికి అలంకారం చేశారు. ఆలయ ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాన్ని కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. అమ్మవారిని దర్శిచుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు వన్‌ రూపీ కాయిన్‌ ఆలయ నిర్వాహకులు కానుకగా అందజేస్తున్నారు.

కోనసీమలో కరెన్సీ అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 15రోజుల పాటు కష్టపడి నోట్లను కుచ్చినట్లు నిర్వహకులు తెలిపారు. కొత్త కరెన్సీ నోట్లను భక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసినట్లు చెప్పారు. అలంకరణ అనంతరం తిరిగి భక్తులకు ఇస్తామన్నారు. ఈకరెన్సీ నోట్లకు ఎంతో విశిష్టత ఉందని.. అమ్మవారి అలంకారణం కోసం వాడిన నోట్లను శుభకార్యాలకు, పెళ్లిలకు ఉపయోగిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కరెన్సీ నోట్లతో ప్రతి ఏడాది అమ్మవారికి అలంకారం చేస్తామని తెలిపారు.