Madanapalle Lady Don Arrested: భూ ఆక్రమణలు, మోసాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన లేడీ డాన్‌ కోనేటి సులోచనను పోలీసులు అరెస్ట్ చేశారు. సులోచనపై పలు పోలీస్ స్టేషన్‌ లలో మొత్తం 14 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అమాయకులను మోసం చేయడం.. భూ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడడం ఆమె నైజంగా పోలీసులు అనుమానిస్తున్నారు. భూ ఆక్రమణల కేసులు, హత్యాయత్నం, రౌడీ షీట్‌కు సంబంధించిన కేసులు సైతం లేడీ డాన్ సులోచనపై ఉన్నాయి.

మదనపల్లెలోని నీరుగట్టుపల్లెకు చెందిన సులోచనపై మదనపల్లె వన్‌ టౌన్, టూటౌన్‌, తాలూకా పీఎస్‌ పరిధిలో కేసులు నమోదయ్యాయి. పలు నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆమెను.. ఎస్పీ ధీరజ్‌, అదనపు ఎస్పీ వెంకట్రాది, డీఎస్పీ ప్రసాద్ ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెపై వివిధ పీఎస్‌లలో నమోదైన ఫిర్యాదులు, కేసుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమెపై ఉన్న ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. ఈవిచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తే చర్యలు తీసుకుంటారని తెలుస్తుంది. స్థానిక ఎన్నికల ముందు మదనపల్లెలో లేడీ డాన్‌ను అరెస్ట్ చేయడం హాట్‌ టాపిక్‌ మారింది.