Ganja Found in Corn Field in Nellore: టెక్నాలజీ పుంతలు తొక్కుతున్న ఈటైంలో కూడా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తాము చేసే నేరాలు పసికట్టలేరనే భ్రమలో దారుణాలకు పాల్పడుతున్నారు. సినిమాల తరహాలో క్రైమ్ చేస్తున్నారు. నెల్లూరు జరిగిన ఓఘటన పోలీసులే నివ్వేరపోయేలా చేసింది. ఆపరేషన్‌ త్రిశూల్‌లో భాగంగా పోలీసులు డ్రోన్‌ ఆపరేట్ చేస్తే అక్కడ కనిపించిన విజువల్స్ చూసి ముక్కున వేలేసుకున్నారు. చుట్టూ మొక్కజొన్న తోట.. మధ్యలో గుమగుమలాడే గంజాయిని ఎంచక్కగా పెండడం చూసి విస్తుపోయారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో భారీ మొత్తంలో సాగుచేస్తున్న గంజాయిని గుట్టురట్టు చేశారు జిల్లా పోలీసులు. ఆపరేషన్‌ త్రిశూల్‌లో భాగంగా మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దుత్తలూరు శివారులో మొక్కజొన్న పంట మధ్యలో సుమారు రెండు ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రోన్‌ సాయంతో గంజాయి పంటను పసిగట్టారు. ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో 1,731 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు.

మూడు నెలలుగా గంజాయి పంటను రహస్యంగా సాగుచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సాగు చేస్తున్న గంజాయి మొక్కలు ప్రజెంట్ 3 నుంచి 6 అడుగుల ఎత్తు పెరిగాయి. ఈకేసులో ప్రధాన నిందితుడు ఉప్పలపాటి సుబ్బారెడ్డితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. మన్యం, శ్రీకాకుళంజిల్లా వాసుల సహకారంతో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. వీరికి గుంటూరు, పుంగనూరు ప్రాంతాల నుంచి ఆర్థిక సహకారం అందుతుందని పోలీసులు విచారణలో తేలింది. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి సాగుచేయడంపై పోలీసులు విస్తృత స్థాయిలో ధర్యాప్తు చేస్తున్నారు. ఈముఠా వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. స్థానిక రెవిన్యూ అధికారుల సమక్షంలో గంజా పంటను పీకేసి పెట్రోల్ పోసి ధ్వంసం చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు.