Punganur Issue Mithun Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయ రణరంగం మొదలైంది. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పుంగనూరు ఒక్కసారిగా పొటిలికట్ పొగలు కక్కింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు జరగనున్నాయి. అయితే మొదటి రోజు .. నామినేషన్లు మొదలైన మొదటి గంటలోనే పుంగనూరు నియోజకవర్గంలో దాడులు ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం రేపాయి. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ఎంపీ మిథున్‌ రెడ్డి కన్వాయ్‌పై దాడి చేశారు.

దాడి ఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ స్పందించారు. పుంగనూరులో వైసీపీ చట్టాలను ఉల్లంఘించి హంగామా సృష్టించారని అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి సహా సుమారు 100మంది ఆయన అనుచరులు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియలోను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించలేదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ధీరజ్ చెప్పారు.

పుంగనూరులో జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్. దాడులకు పెద్దిరెడ్డి కుటుంబమే కారణం అన్నారు. ఎన్నికలు ముగిసే వరకు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను అరెస్ట్‌ చేసి జైలులో పెట్టాలన్నారు. అప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని చెప్పారు. పుంగనూరులో దాడుల వెనుక మిథున్‌ రెడ్డి కుట్ర దాగి ఉందన్నారు. ఆకుట్రకు తానే ప్రత్యక్షి సాక్షినని చెప్పారు. దాడుల కుట్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.