AP MPTC ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌ కేంద్రాల్లో తమ పార్టీ ఏజెంట్లను అనుమతించడం లేదని వైసీపీ నేతలు ఆరోపించగా, రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అనంతపురం జిల్లా భోగినేపల్లిలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. వైసీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూ నిరసనకు దిగారు. పల్నాడు జిల్లా గురజాలలోనూ వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల ఎదుట ఆందోళన చేపట్టారు. రిగ్గింగ్ జరుగుతోందంటూ ఆరోపణలు చేయడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

చంద్రగిరిలో సుధారెడ్డి వర్సెస్ చెవిరెడ్డి

చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి సుధారెడ్డి, చెవిరెడ్డి వర్గాల మధ్య రాజకీయ వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షిత్‌రెడ్డి నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. చెవిరెడ్డి అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎక్కడికి వెళ్తే తాను కూడా అక్కడికే వెళ్తానని ఆమె ప్రకటించడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కారు ఎక్కడికి వెళ్తే.. సుధారెడ్డి సైతం అక్కడికి వెళ్తున్నారు.

పులివెందులలో వైసీపీ–టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. పలు గ్రామాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పులివెందుల మండలంలోని ఆర్. తుమ్మలపల్లి గ్రామంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడం లేదని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్తున్న ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మరోవైపు పెద్దముడియం మండలం గుండ్లకుంటలోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, టీడీపీ ఏజెంట్లను బయటకు పంపించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను అదుపు చేశారు. వేములలో అయితే ఇరువర్గాలు పెట్రోల్ బాంబులు విసురుకున్నారు.

మార్కాపురం జిల్లాలో ఓటింగ్ బహిష్కరణ

మార్కాపురం జిల్లా పీసీపల్లి మండలం అయ్యవారిపల్లి గ్రామంలో గ్రామస్తులు ఎన్నికల ఓటింగ్‌ను బహిష్కరించారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని, మిగతా సమయాల్లో గ్రామ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను

మరోవైపు గుంటూరు జిల్లా పెదకాకాని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు మన జన్మహక్కు అని, ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని ఆయన సూచించారు. ఇక కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ బుర్రిపాలెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ పలు జిల్లాల్లో ఘర్షణలు, నిరసనలు, ఓటింగ్ బహిష్కరణ ఘటనలు చోటుచేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.