శబరిమల భక్తులకు గుడ్న్యూస్.. నేరుగా ఇంటికే స్వామి ప్రసాదం
Sabarimala Prasadam Home Delivery: అయ్యప్పస్వామి భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా పోస్ట్ ద్వారా స్వామివారి ప్రసాదాన్ని నేరుగా ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో భక్తులకు మోత బరువు తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Sabarimala Prasadam Home Delivery: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఈసారి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మండల-మకరవిళక్కు యాత్రకు సంబంధించి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 17 నుంచి 41 రోజుల పాటు ఆలయం తెరిచి ఉండనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ వెల్లడించారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని సంతోషంగా ఇళ్లకు చేరుకోవడమే బోర్డు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండటం, పొడవైన క్యూలు, అప్పం, అరవణ ప్రసాదాల కొరత, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక ప్రసాదం కోసం బరువు మోయాల్సిన పనిలేదు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు మరో తీపి కబురు అందనుంది. స్వామివారి దర్శనం అనంతరం అరవణ పాయసం, అప్పం ప్రసాదాలను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త సదుపాయం కల్పిస్తున్నారు. భక్తులు కోరుకున్న ప్రసాదాలను నేరుగా వారి ఇంటి చిరునామాకే పంపించేలా ఇండియా పోస్ట్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా శబరిమల సన్నిధానంలో అరవణ, అప్పం విక్రయ కౌంటర్ల సమీపంలోనే ఇండియా పోస్ట్ ప్రత్యేక పార్శిల్ బుకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం 24 గంటల పాటు పనిచేయనుంది. భక్తులు అక్కడ తమకు కావాల్సిన ప్రసాదాలను బుక్ చేసుకుంటే, స్పీడ్ పోస్ట్ ద్వారా దేశంలోని ఏ ప్రాంతానికైనా వారి ఇంటి వద్దకే చేరవేస్తారు. దీంతో కొండపై నుంచి తిరిగి వెళ్లే సమయంలో ప్రసాదం ప్యాకెట్లను మోసుకెళ్లే ఇబ్బందులు తప్పనున్నాయి. ముఖ్యంగా రద్దీ అధికంగా ఉండే రోజుల్లో ఈ సేవ భక్తులకు ఎంతో సౌకర్యంగా మారనుంది.
దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లోనూ ప్రసాదం బుకింగ్
ప్రసాదాలను ఇంటికి తెప్పించుకునేందుకు శబరిమలకే వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల ద్వారా సైతం అయ్యప్ప స్వామి అరవణ, అప్పం ప్రసాదాలను బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రసాదాలు సురక్షితంగా భక్తులకు చేరేలా ప్రత్యేక ప్యాకేజింగ్ చేయనున్నారు. అంతేకాకుండా వర్చువల్ క్యూ టికెట్ బుకింగ్ సమయంలోనే భక్తులు తమకు అవసరమైన ప్రసాదాలను ముందస్తుగా ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. చెల్లింపుల విషయంలోనూ డిజిటల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. క్యూఆర్ కోడ్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ద్వారా భక్తులు సులభంగా నగదు చెల్లించవచ్చు.
శబరిమల ఆలయ ప్రవేశంపై ట్రాన్స్జెండర్ పిటిషన్.. కేరళ ప్రభుత్వం అభ్యంతరం
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరుతూ ఓ ట్రాన్స్జెండర్ దాఖలు చేసిన పిటిషన్పై కేరళ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషనర్ లింగాన్ని నిర్ధారించే వైద్యపరమైన లేదా అధికారిక ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోతే ఆలయ ప్రవేశానికి అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ అంశంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అనుసరిస్తున్న వైఖరికి ప్రభుత్వం మద్దతు తెలిపింది. ఆలయ ప్రవేశానికి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉన్నందున, ఈ దశలో తాము స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది.



