కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి మహిమ అంటే ఇదే
Tirumala Water Storage: తిరుమల కొండపైకి మళ్లీ జలకళ.. ఐదు జలాశయాల్లోకి చేరుతున్న వరద నీరు. మరో ఐదు నెలల పాటు నీటి కష్టాలు లేనట్లే.. డిసెంబరు వరకు వర్షాలు కురిస్తే ఏడాదంతా ఢోకా లేదంటున్న టీటీడీ అధికారులు.

Tirumala Water Storage: ఇది కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి మహిమ అంటే ఇదేనా.. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా నీటి కష్టాలు పెరుగుతున్న వేళ.. స్వయంభువుగా కొలువైన సప్తగిరులపై మాత్రం నీటి ఎద్దడి తప్పేలా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా తిరుమల కొండల్లో కురుస్తున్న వర్షాలతో అక్కడి జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. డిసెంబరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలతో ఐదు ప్రధాన జలాశయాల్లోనూ నీటి నిల్వలు గణనీయంగా పెరుగుతాయని టీటీడీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలకు నిత్యం లక్ష మంది భక్తులు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. 1950 సంవత్సరం వరకు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య వందల్లోనే ఉండేది. ఆ తర్వాత 1975 నాటికి ఈ సంఖ్య వేలల్లోకి చేరింది. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతూ వారాంతాల్లో 25 వేల మంది, సాధారణ రోజుల్లో 10 వేల మంది తిరుమలకు వచ్చేవారు. 1990 నాటికి భక్తుల సంఖ్య మరింత పెరిగింది. వారాంతాల్లో 50 వేల మంది, సాధారణ రోజుల్లో 25 వేల మంది స్వామివారిని దర్శించుకునేవారు. ఇక 2000 సంవత్సరం నుంచి ఈ సంఖ్య గణనీయంగా పెరిగి సాధారణ రోజుల్లో 70 వేలు, వారాంతాల్లో లక్ష మంది వరకు చేరుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీతో పాటు తిరుమలలో నివాసముంటున్న స్థానికులు, ఉద్యోగుల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ దశలవారీగా ఐదు ప్రధాన జలాశయాలను నిర్మించింది.
గోగర్భం డ్యాంకు మళ్లీ జలకళ
తిరుమలలో నిర్మించిన జలాశయాల్లో గోగర్భం డ్యాం మొదటిది. 1963 అక్టోబరు 1న అప్పటి కేంద్ర మంత్రి కేఎల్ రావు ఈ డ్యాంను ప్రారంభించారు. భూ ఉపరితలానికి 2,894 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,833 లక్షల గ్యాలన్లు. ఇందులో 2,683 లక్షల గ్యాలన్ల నీటిని భక్తుల అవసరాలకు వినియోగించుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం వరకు ఈ జలాశయం పూర్తిగా ఎండిపోయింది. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో మళ్లీ నీరు చేరుతోంది. ప్రస్తుతం సుమారు 1,000 లక్షల గ్యాలన్ల నీరు డ్యాంలోకి చేరినట్లు అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు వరద నీరు చేరే అవకాశం ఉందని టీటీడీ వాటర్ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు.
పాపవినాశనంలో పెరుగుతున్న నీటి నిల్వలు
1983 ఫిబ్రవరి 2న టీటీడీ పాపవినాశనం జలాశయాన్ని నిర్మించింది. ఈ డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 5,240 లక్షల గ్యాలన్లు. గతంలో ఈ జలాశయంలోనూ నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే గత కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మారుతోంది. ఇప్పటికే పాపవినాశనం జలాశయంలోకి 3,000 లక్షల గ్యాలన్ల నీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు నిరంతరం డ్యాంలోకి వస్తుండటంతో రానున్న రోజుల్లో నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశముంది. 2002 ఏప్రిల్ 27న ఆకాశగంగ డ్యాంను టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 633 లక్షల గ్యాలన్లు. గత నెలలో ఈ డ్యాం పూర్తిగా అడుగంటిపోయింది. తాజాగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ఆకాశగంగ జలాశయంలో 200 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద నీరు వచ్చి చేరుతుండటంతో రాబోయే రోజుల్లో నిల్వలు మరింత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
జంట జలాశయాల్లోనూ పెరుగుతున్న నీరు
తిరుమలలోని మరో రెండు ప్రధాన జలాశయాలైన కుమారధార, పసుపుధార ప్రాజెక్టులను 2012 అక్టోబరులో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రెండు జలాశయాల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 5,492 లక్షల గ్యాలన్లు. ప్రస్తుతం ఈ జంట జలాశయాల్లో కలిపి 1,500 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. భాకరాపేట అటవీ ప్రాంతంతో పాటు శేషాచల కొండల అటవీ ప్రాంతం నుంచి వరద నీరు ఆనకట్టల్లోకి చేరుతోంది. దీంతో రానున్న రోజుల్లో నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రోజుకు 55 లక్షల గ్యాలన్ల వరకు నీటి అవసరం
తిరుమలలో నిత్యం 40 లక్షల నుంచి 55 లక్షల గ్యాలన్ల వరకు నీరు అవసరమవుతుంది. భక్తులతో పాటు స్థానికులు, ఉద్యోగుల అవసరాల కోసం ఈ నీటిని వినియోగిస్తున్నారు. ఐదు ప్రధాన జలాశయాలతో పాటు తిరుపతిలోని కల్యాణి డ్యాం నుంచి కూడా 10 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. గతంలోనూ భారీ వర్షాలతో తిరుమల జలాశయాలు జలకళను సంతరించుకున్న సందర్భాలున్నాయి. 2015లో కురిసిన భారీ వర్షాలకు ఐదు జలాశయాలూ పూర్తిగా నిండాయి. ఏడాది విరామం తర్వాత 2017లో సమృద్ధిగా నీరు చేరింది. ఆ తర్వాత 2021లోనూ జలాశయాలు నిండుకుండల్లా కనిపించాయి. 2024లో మరోసారి తిరుమలలో జలకళ సంతరించుకుంది.
మరో ఐదు నెలల పాటు నీటి కష్టాలు లేనట్లే
గత నెల నుంచి అడపాదడపా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లోకి నీరు చేరుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఐదు నెలల పాటు తిరుమలలో నీటి ఎద్దడి ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నవంబరు, డిసెంబరు నెలల్లో భారీ వర్షాలు కురిస్తే ఆ ఏడాది మొత్తం నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా నీటి కొరత ఆందోళన కలిగిస్తున్న తరుణంలో సప్తగిరులపై జలాశయాలు మళ్లీ కళకళలాడుతుండటం భక్తులకు, టీటీడీ అధికారులకు ఊరటనిస్తోంది.



