వేడి వేడి మండి.. ఆరోగ్యాలకు గండి!
Mandi Biryani Health Problems: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వినిపిస్తోంది ఒక్కటే మండి బిర్యానీ. పట్టణాల నుంచి పల్లెటూర్ల వరకు అందరూ మండి బిర్యానీ తినాలని అనుకుంటున్నారు.

Mandi Biryani Health Problems: మండి బిర్యానీ. హైదరాబాద్ సిటీలోనే కాదు చిన్నపాటి పట్టణాల్లోనూ అదో వేలంవెర్రి ట్రెండ్‌గా మారిపోతోంది. కానీ వండేదంతా బిర్యానీ కాదు. వేడిగున్నంత మాత్రాన ఫ్రెష్ అయిపోదు. ఏది పెట్టినా తినేసి చేయి కడుక్కుంటారన్నట్లు కొన్ని రెస్టారెంట్లు వండివారుస్తున్నాయి. రోజులతరబడి నిల్వ ఉంచిన మాంసంతో నాణ్యతా ప్రమాణాలేమీ పాటించకుండానే కొన్ని హోటళ్లు నడుస్తున్నాయి.
జిహ్యచాపల్యంకొద్దీ మండి బిర్యానీ తిన్న యువకుడు ప్రాణాలు కోల్పోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న 19ఏళ్ల సాయిరామ్ తీవ్ర అస్వస్థతకు గురై చికిత్సపొందుతూ మరణించాడు. అతనితో పాటు ఆ రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న మరో 18మంది ఆసుపత్రి పాలయ్యారు. కలుషిత ఆహారం వారి ప్రాణాలమీదికి తెచ్చింది.
హైదరాబాద్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో దారుణమైన విషయాలు బయటపడుతున్నాయి. వారాలు, నెలల తరబడి మాంసం నిల్వచేస్తున్నారు. అపరిశుభ్ర కిచెన్లకు తోడు కాలంచెల్లిన ఆహారపదార్థాలు అడ్డగోలుగా వాడేస్తున్నారు. దీంతో రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు వస్తున్నాయి. నర్సాపూర్ ఘటనతోనైనా అధికారులు కళ్లు తెరవకపోతే మరిన్ని అనర్ధాలు చూడాల్సి వచ్చేలా ఉంది.



