Expired Medicines: ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండటం ఎంత ముఖ్యమో, అందులోని మందుల గడువు తేదీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం కూడా అంతే ముఖ్యం. అయితే, చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. పొరపాటునో, తెలియకో గడువు ముగిసిన మాత్రలు వేసుకున్న తర్వాత ఆందోళనకు గురవుతుంటారు. ఏదైనా ఔషధానికి గడువు తేదీని నిర్ణయించేటప్పుడు దాని భద్రత, ప్రభావశీలత, నాణ్యతను పరిగణనలోకి తీసుకుంటారు. నిర్దిష్ట పరిస్థితుల్లో నిల్వ ఉంచినప్పుడు మందు ఎంతకాలం వరకు నాణ్యతను నిలుపుకుంటుందో పరీక్షిస్తారు. ఈ క్రమంలో టెంపరేచర్, వెలుతురు, ఆక్సిజన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వివిధ నాణ్యత నియంత్రణ పరీక్షల అనంతరం మందులపై గడువు తేదీని ముద్రిస్తారు.

గడువు ముగిసిన ట్యాబ్లెట్స్‌తో ఎలాంటి ప్రమాదాలు?

గడువు ముగిసిన ట్యాబ్లెట్లు వాడటం వల్ల కలిగే ప్రమాదాలు ఆ ఔషధం రకం, దాని నిల్వ పరిస్థితులు, గడువు ముగిసి ఎంతకాలమైందనే అంశాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని మందులు కాలక్రమేణా తమ ప్రభావాన్ని కోల్పోవచ్చు. మరికొన్ని మందుల నాణ్యత దెబ్బతినడం వల్ల ఆశించిన ఫలితం లభించకపోవచ్చు. ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యాలకు ఉపయోగించే మందులు ప్రభావం కోల్పోతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇన్సులిన్ వంటి మందులు గడువు ముగిసినప్పుడు లేదా సరిగా నిల్వ చేయనప్పుడు వాటి ప్రభావం తగ్గవచ్చు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడం కష్టమవుతుంది. కొన్ని హార్మోన్ మందుల ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి మందులను వైద్యుల సూచనల ప్రకారమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే కొన్ని మందులు, ఉదాహరణకు నైట్రోగ్లిజరిన్, గడువు ముగిసిన తర్వాత ఆశించినంత ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సరైన చికిత్స ఆలస్యం కావడం ప్రాణాపాయానికి తీయొచ్చని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ఎక్స్‌పైర్ డేట్‌ను తప్పకుండా తనిఖీ చేయాలి.

ఫార్మసిస్ట్ సలహా తప్పనిసరి

కొన్ని మందులు గడువు తేదీ దాటిన వెంటనే హానికరంగా మారకపోవచ్చు. అయినప్పటికీ, వాటి భద్రత, నాణ్యత, ప్రభావశీలతను ఇంట్లోనే చూసి నిర్ధారించడం సాధ్యం కాదు. అందువల్ల గడువు ముగిసిన మందులను వైద్యులు లేదా ఫార్మసిస్ట్ సలహా లేకుండా ఉపయోగించకూడదు. ముఖ్యంగా ప్రాణాలను కాపాడే అత్యవసర మందుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. మందుల గడువు తేదీని తనిఖీ చేయడం చిన్న విషయంగా అనిపించినా, అది మన ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమైన అలవాటు. గడువు ముగిసిన ప్రతి మందు విషపూరితమని చెప్పలేకపోయినా, వాటి నాణ్యత, ప్రభావశీలత, భద్రతపై నమ్మకంగా ఉండలేం. అందుకే ఇంట్లోని ప్రథమ చికిత్స పెట్టెలో మందులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, గడువు ముగిసిన వాటిని సురక్షితంగా తొలగించాలి. అందుకే వెంటనే మీరు మెడికల్ కిట్‌ను క్రమం తప్పకుండా చూసుకోండి..