Andhra Pradesh Weather Alert: ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. రాబోయే 3గంటల్లో పలు జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈమేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, పుత్తూరు, సత్యవేడు, శ్రీసిటీ, తడ పరిసర ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ జారీ చేసింది.

గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికతో ఆయా జిల్లాల్లోని అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేశారు. చెట్ల కింద ఉండొద్దని సూచించారు.