Dodla Milk Caught in FSSI Check

తెల్లనివన్నీ పాలుకావు. అది దొడ్ల డెయిరీ అయినా, మరో బ్రాండెడ్‌ మిల్క్‌ అయినా. లూజ్‌ పాలలో ఏవో ఒకటి కలుపుతున్నారనుకుంటే పాకెట్‌ పాలు కాదు సేఫ్‌ కాదని తేలిపోయింది. పైగా బ్రాండ్‌కున్న పేరుతో గుడ్డిగా కొనేస్తుంటే.. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పేరున్న దొడ్ల డెయిరీ పాల శాంపిల్స్‌లో ప్రమాదకర రసాయనాలు(Dodla Milk Caught in FSSI Check) బయటపడ్డాయి. దొడ్ల డెయిరీ పాలలో డిటర్జెంట్‌ లేదా కాస్టిక్‌ సోడా అవశేషాలున్నాయనే సంచలన నిజం బయటికొచ్చింది.

అనుమానాలు కాదు. స్వయంగా జాతీయ ఆహారభద్రత ప్రమాణాల నియంత్రణమండలి ఈవిషయాన్ని నిర్ధారించింది. దొడ్ల డెయిరీ నుంచి సేకరించిన ఫుల్‌ క్రీమ్‌ పాల నమూనాలను ల్యాబ్‌ టెస్ట్‌కి పంపితే అవి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవన్న విషయం నిర్ధారణైంది. అవి నాసిరకం పాలని ఫుడ్‌ అనలిస్ట్‌ ధృవీకరించటంతో.. కంపెనీ దీనిపై అప్పీల్‌కి వెళ్లింది. డిటర్జెంట్‌, కాస్టిక్‌ సోడా ఉన్న దొడ్ల డెయిరీ పాలు వాడకానికి పనికివారవని రిఫరల్‌ ఫుడ్‌ లేబరేటరీ తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారికంగా నిర్ధారించటంతో ప్యాకెట్‌ పాలు కూడా సురక్షితం కాదని తేలిపోయింది.

పాలే కాదు.. టైంపాస్‌కి నమిలే బిస్కెట్లు కూడా ప్రమాదకరమే. ఎందుకంటే ప్రియాగోల్డ్‌ బిస్కెట్లలో పశువల దాణాలో వినియోగించే తవుడును గుర్తించారు. అంటే వినియోగదారులను కూడా కంపెనీలు గేదెల్లాగే భావిస్తున్నట్లున్నాయి. సూర్య ఫుడ్‌ అండ్‌ ఆగ్రో సంస్థ తయారీకేంద్రంలో జరిపిన తనిఖీల్లో పశువుల దాణా గోనెసంచులను గుర్తించారు. ఆ సంస్థ లైసెన్స్‌ని గతంలోనే సస్పెండ్‌ చేసిన fssai ఇప్పుడు ప్రాసిక్యూషన్‌ చర్యలు మొదలుపెట్టింది. UEIR ఆర్గానిక్‌ ఫుడ్స్‌ ఎల్లో రైజిన్స్‌ అమ్మే ఎండుద్రాక్ష, కిస్మిస్‌లో పురుగుమందుల అవశేషాలు బయటపడ్డాయి. సో..బయటకొనే ఏ వస్తువునీ నమ్మే పరిస్థితి లేదు. ఇలాగైతే ఏం తిని బతకాలో ఏమో!