Hyderabad Airport Bomb Threat: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ (E-mail) రావడం కలకలం రేపింది. విమానాశ్రయంతో పాటు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలను పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు మొత్తం 12 సార్లు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చినట్లు గుర్తించారు. ఈ మెయిల్స్‌ను ఎవరు పంపించారు? ఎక్కడి నుంచి పంపిస్తున్నారు? వీటి వెనుక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, లేక మరేదైనా ఉద్దేశం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. వరుసగా బెదిరింపు మెయిల్స్ రావడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

ఈ కేసులో సాంకేతిక ఆధారాలను సేకరించి, ఈ-మెయిల్స్ పంపిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును హైదరాబాద్ (Hyderabad) సైబర్ పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సైబర్ (Cyber Crime) నిపుణుల సహాయంతో మెయిల్స్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలను పరిశీలించి, నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విమానాశ్రయం, పాఠశాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన ఈ బెదిరింపుల వెనుక అసలు ఉద్దేశం ఏమిటనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ మెయిల్స్‌ను ఎవరు పంపిస్తున్నారు? వరుసగా 12 సార్లు బెదిరింపులు చేయడానికి కారణమేంటి..? ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గతంలో పలుమార్లు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చిన తర్వాత అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. చివరకు ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.