బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షాలు..?
AP Weather Alert: నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురిసే ఛాన్స్. మరోవైపు రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత, ఉదయం వేళ పొగమంచుతో ప్రజలకు ఇబ్బందులు.

AP Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ అంచనాలు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వరుస తుఫాన్ల ప్రభావంతో అతలాకుతలమైన కోస్తాంధ్ర ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో మరోసారి అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
ఏపీకి వర్ష ముప్పు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు!
కొత్తగా ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే రెండు రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో రైతులు, మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో పెరుగుతున్న చలి.. హైదరాబాద్‌లో పొగమంచు
ఓవైపు అల్పపీడనం కారణంగా వర్ష సూచనలు ఉండగా.. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. (Telangana Weather) ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ వంటి శివారు ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కనిపిస్తోంది. సాయంత్రం 5:30 గంటల తర్వాత చల్లని గాలుల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తీవ్ర తుఫాన్‌గా మారుతుందా..?
నవంబర్ 13న ఏర్పడే అవకాశం ఉన్న అల్పపీడనం కదలికలు, తీవ్రతపై వాతావరణశాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ఇది ఏ దిశగా కదులుతుంది.. ఎంతవరకు బలపడుతుంది.. ఏయే ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది.. అనే అంశాలపై అల్పపీడనం ఏర్పడిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని వాతావరశాఖ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న కోస్తాంధ్ర ప్రజలకు తాజా అల్పపీడనం వార్త ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా వాతావరణశాఖ అధికారిక హెచ్చరికలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆకస్మిక వర్షాలు, ఈదురుగాలుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చలి నుంచి రక్షణ పొందేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాని సూచిస్తున్నారు.



