అంబర్‌పేట నుంచి ఆసియా కప్ వరకు.. యశ్వీర్ గౌడ్ పౌరుషం
Yashveer Goud Cricket: యశ్విర్ గౌడ్.. విన్నింగ్ షాట్‌తో పాకిస్థాన్‌కు షాక్.. మైదానంలోనే కవ్వింపులకు సమాధానం.. అండర్-19 భారత్ విజయంలో కీలక పాత్ర. హైదరాబాద్ కుర్రాడిపై సోషల్ మీడియాలో ట్రెండింగ్.

Yashveer Goud Cricket: హైదరాబాద్ అంబర్‌పేట గల్లీల నుంచి అంతర్జాతీయ క్రికెట్ వేదిక వరకు ఎదిగిన యువ సంచలనం ఉట్కూరి యశ్వీర్ గౌడ్. ఆసియా కప్ వేదికగా తన ఆటతోనే కాదు.. మైదానంలో చూపించిన తెగువ, ఆత్మవిశ్వాసం, భావోద్వేగంతోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అండర్-19 స్థాయిలో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ, విన్నింగ్ షాట్‌తో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన యశ్వీర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. అతడి ప్రదర్శన భారత అభిమానుల్లో ఆనందాన్ని నింపితే, మైదానంలో అతడు చూపించిన దూకుడు మరోసారి భారత్-పాకిస్థాన్ క్రికెట్ పోటీకి ఉన్న తీవ్రతను గుర్తుచేసింది.
పాక్ కవ్వింపులకు మైదానంలోనే బదులు
ఈ ఆసియా కప్ పోరులో భారత్, పాకిస్థాన్ మధ్య పోటీ కేవలం పరుగులు, వికెట్లకే పరిమితం కాలేదు. గ్రూప్ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత పాకిస్థాన్ ఆటగాడు హంజా జహూర్ జేబులోంచి ముందుగానే రాసుకున్న చిట్టీని బయటకు తీసి, దానిని దీపావళి గిఫ్ట్‌గా అభివర్ణిస్తూ హడావుడి చేశాడు. ఆ సందర్భంలో పాక్ ఆటగాళ్లు ప్రదర్శించిన అతివిశ్వాసం, మైదానంలో చేసిన హంగామా భారత అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. అంతేకాదు, ఫైనల్లో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలోనూ పాకిస్థాన్ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు దిగుతూ మన బ్యాటర్లను కవ్వించే ప్రయత్నం చేశారు. మాటలతో ఒత్తిడి పెంచి భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనుకున్నారు. అయితే, ఆ కవ్వింపులకు సమాధానం చెప్పాల్సిన అసలైన సమయం వచ్చినప్పుడు భారత యువ ఆటగాళ్లు తమ బ్యాట్‌తోనే జవాబిచ్చారు. ముఖ్యంగా యశ్వీర్ గౌడ్ విన్నింగ్ షాట్‌తో విజయాన్ని ఖరారు చేయడం ఈ పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విన్నింగ్ షాట్‌తో పాకిస్థాన్‌కు షాక్
ముందుగా చిట్టీలు రాసుకుని బిల్డప్ ఇవ్వడం ఒక ఎత్తయితే, కీలక సమయంలో జట్టుకు విజయాన్ని అందించడం మరో ఎత్తు. యశ్వీర్ గౌడ్ రెండో పనిని చేసి చూపించాడు. భారత జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషిస్తూ, విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌కు విజయవంతమైన ముగింపు పలికాడు. దీంతో పాకిస్థాన్ ఆటగాళ్లు చేసిన కవ్వింపులకు మైదానంలోనే సమాధానం దొరికినట్లయింది. విజయం ఖరారైన తర్వాత యశ్వీర్ మైదానంలో ప్రదర్శించిన పౌరుషం, భావోద్వేగం కూడా ప్రత్యేకంగా నిలిచాయి. అతడి ఆటిట్యూడ్, విజయాన్ని ఆస్వాదించిన తీరు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ దృశ్యాలు భారత్‌తో పాటు పాకిస్థాన్ సోషల్ మీడియా వేదికలపైనా చర్చకు దారితీశాయి. భారత ఆటగాళ్ల దూకుడుపై పాకిస్థాన్‌కు చెందిన కామెంటేటర్లు, విశ్లేషకులు స్పందించడం కూడా ఈ మ్యాచ్ చుట్టూ నెలకొన్న ఆసక్తిని మరింత పెంచింది.
హైదరాబాద్ కుర్రాడి ఆటిట్యూడ్‌కు ఫిదా
అంబర్‌పేట గల్లీల నుంచి ఎదిగి ఆసియా కప్ వంటి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటడం యశ్వీర్ గౌడ్ ప్రయాణంలో ప్రత్యేకమైన ఘట్టం. అండర్-19 భారత జట్టు విజయంలో కీలకంగా నిలవడంతో పాటు, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయాన్ని అందించిన క్షణంలో భాగస్వామి కావడం అతడి ప్రదర్శనకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ మ్యాచ్ మరోసారి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ప్రత్యర్థి చేసే కవ్వింపులకు మాటలతో సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో ఆటతో నిరూపించుకుంటే చాలని భారత యువ ఆటగాళ్లు చూపించారు. పాకిస్థాన్ ఆటగాళ్లు ముందుగా చేసిన హడావుడికి, భారత యువ ఆటగాళ్లు విజయంతో బదులిచ్చారు.
ఫైనల్లో ఆటతోనే సమాధానం చెప్పాం: యశ్వీర్ గౌడ్
దీపావళి రోజు ఎదురైన ఓటమి తమలో మరింత పట్టుదలను పెంచిందని భారత ఆటగాడు యశ్వీర్ గౌడ్ వెల్లడించాడు. స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ.. ఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్ల నుంచి మాటలు, దూషణలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపాడు. ఓటమి పాలవడంతో అప్పట్లో తాము ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయామని, అయితే ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ సరైన సమయం వచ్చినప్పుడు మైదానంలోనే తమ సత్తా చాటాలని నిర్ణయించుకున్నామని వివరించాడు. భారత్ అంటే ఏంటో మాటలతో కాకుండా ఆటతో చూపించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని యశ్వీర్ స్పష్టం చేశాడు. గతంలో పాక్ ఆటగాళ్లు తమతో ఎలా వ్యవహరించారో, తాము కూడా అదే విధంగా స్పందించామని పేర్కొన్నాడు. భారత జెర్సీ ధరించి దేశం కోసం ఆడుతున్న తమకు ఈ క్షణం ఎంతో ప్రత్యేకమని, ఇలాంటి అవకాశం కోసమే ఎంతోకాలంగా ఎదురుచూశామని చెప్పాడు. ఈ సందర్భంలో జట్టులోని ప్రతి ఒక్కరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని యశ్వీర్ గౌడ్ వెల్లడించాడు.
యశ్వీర్ గౌడ్.. కేరాఫ్ హైదరాబాద్
మొత్తంగా ఆసియా కప్ విజయం భారత అండర్-19 జట్టుకు చిరస్మరణీయంగా నిలిస్తే, యశ్వీర్ గౌడ్ ప్రదర్శన మాత్రం హైదరాబాద్ అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది. విన్నింగ్ షాట్‌తో పాకిస్థాన్ ఆశలకు తెరదించి, మైదానంలో తనదైన ముద్ర వేసిన ఈ హైదరాబాద్ కుర్రాడికి నిజంగానే హ్యాట్సాఫ్..



