కలికాలం.. యంత్రుడూ కంతిరోడే!
Robots Are Becoming More Advanced: ప్రస్తుత కాలంలో రోబో మనుషుల కన్నా దారుణంగా తయారయ్యాయి. ఓ వ్యక్తి తయారు చేసిన రోబో.. అతని లవర్ను హగ్ చేసుకోబోయింది.

Robots Are Becoming More Advanced: రోబో సినిమా గుర్తుందిగా. రజినీకాంత్ సృష్టించిన రోబో ప్రోగ్రామ్ మార్చుకుని ఐశ్వర్యారాయ్ వెంటపడుతుంది. తనను సృష్టించినోడి గర్ల్‌ఫ్రెండ్‌నే ట్రాప్ చేయాలని చూస్తుంది. ఆ సినిమా తర్వాత రోబోలు ఇంకా అప్‌డేట్ అయ్యాయి. ఇంటి పనులు చేసిపెడుతున్నాయి. ఆఫీసుల్లో పనులు చక్కబెడుతున్నాయి. దుర్భేద్యమనుకున్న చోటికి కూడా చకచకా చేరిపోతున్నాయి. కానీ మనిషి మేథస్సు పెరిగేకొద్దీ టెక్నాలజీ కూడా ఒక్కోసారి వెర్రితలలు వేస్తోంది.
రోబో ఎన్ని పనులు చేసినా, అన్ని అద్భుతాలు ప్రదర్శించినా సృష్టించింది మనిషేకదా. ఆ మనిషి బుద్ది మారనంత కాలం టెక్నాలజీ కూడా ఒక్కోసారి దారితప్పుతుంటుంది. జర్మనీ రోడ్లపై ఓ రోబో రోమియోగా మారిపోయింది. అమ్మాయి కనబడగానే కొంటెపనులు మొదలుపెట్టింది. జర్మనీలోని కొలోన్ రోడ్డుపై ఈసీన్ చూసినవారంతా షాక్ తిన్నారు. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను హగ్ చేసుకుని వారితో రోబో అనుచితంగా ప్రవర్తించింది. ఓ అమ్మాయిని అసభ్యంగా తాకింది.
ఈ సన్నివేశాన్ని ఇద్దరు టీనేజర్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు. రోబో యజమానిగా భావిస్తున్న యువకుడు ఉద్దేశపూర్వకంగానే దానికి అలాంటి ప్రోగ్రామ్ సెట్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులకు కూడా ఇది కొత్తగా ఉంది. ఆకతాయిలనైతే లాఠీలతో రెండు పీకొచ్చు. రోబోను ఎంత కొట్టినా లాఠీలు విరగడం తప్ప దానికి నొప్పి ఉండదుగా. టెక్నాలజీ ప్రపంచంలో ముందుముందు ఇలాంటివి ఇంకెన్నా చూడాల్సి వస్తుందో ఏమో!



