Punjab Cricket Association Land Scam: కొన్ని నెలల క్రితం ఆ భూమి ధర ఎకరా కేవలం రూ.15లక్షలు. దాన్ని ఎంతకు కొన్నారో తెలుసా.. ఏకంగా 3కోట్లకు. అది ఒరిజనల్‌ రియల్‌బూమ్‌ కాదు.. అప్పనంగా డబ్బు కొట్టేయడానికి కొందరు సృష్టించిన కృత్రిమ భూమ్‌. పంజాబ్‌లో జరిగిందీ రియల్‌ స్కామ్‌. రూ.15లక్షల ఎకరా స్థలాన్ని 3కోట్లు పోసి కొన్నదెవరో కాదు. పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలోని ఓ ఊళ్లో ఎకరం భూమిని రూ.15లక్షల లెక్కన కొన్నారు. పోయినేడాది చివర్లో ఈ లావాదేవీలు జరిగాయి. నాలుగైదు నెలలు తిరగకముందే అదే భూమిని పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు ఎకరా రూ.3కోట్ల లెక్కన అమ్మేశారు. అమృత్‌సర్‌, భటింఢా ప్రాంతాలనుంచి పీకేఏ మొత్తం 77.99 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అందులోనే జరిగిందీ దందా.

నెలల వ్యవధిలో 20రెట్లు భూమి విలువ అసాధారణం పెరిగింది. దీంతో పంజాబ్‌ క్రికెట్ అసోసియేషన్‌ బ్లాక్‌డీల్‌పై అందరికీ అనుమానాలు వచ్చాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి ఎంక్వయిరీ చేయాలని పంజాబ్‌ పోలీసులను కోరింది.

భూమి కొనుగోలులో అక్రమాలు జరిగాయని రంజీ మాజీ క్రికెటర్‌ రాకేశ్‌ హండా పంజాబ్‌-హర్యానా హైకోర్టును ఆశ్రయించటంతో ఈ భూభాగోతం వెలుగుచూసింది. పాలకమండలి అనుమతి తీసుకోకుండానే పీసీఏ భూమి కొనుగోలు చేసిందని ఆ క్రికెటర్‌ వేసిన పిటిషన్‌తో పీసీఏతో పాటు ఈడీకి న్యాయస్థానం నోటీసులిచ్చింది. దీంతో ఈ డీల్‌పై ఎంక్వయిరీ చేసిన ఈడీ కోర్టుకు నివేదిక సమర్పించింది.