Yusuf Pathan Plot Controversy: ఇన్‌కంటాక్స్ దాడులు జ‌రుగుతుంటాయి. ఈడీ బృందాలు రంగంలోకి దిగుతుంటాయి. పొద్దున లేచిన‌ప్ప‌ట్నించీ రాత్రి న‌డుం వాల్చేదాకా ఏవో ఒక స‌వాళ్లు ఊపిరాడ‌నీయ‌కుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఈ చేదు అనుభ‌వాల‌న్నీ ఆ పార్టీకి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న‌న్నాళ్లే. నేనూ మీప‌క్ష‌మేన‌ని ఎప్పుడైతే చెప్పేస్తారో గాల్లో తేలిన‌ట్లు, ఒళ్లు తూలిన‌ట్లు ఉంటుంది. క‌ష్టాల‌న్నీ మ‌టుమాయ‌మైపోతాయి. కేసులు గాలివాన‌కు కొట్టుకుపోతాయి. కాస్త కాషాయ పౌడ‌రేసి వాషింగ్‌మిషిన్‌లో కాసేపు తిప్పి బ‌య‌టికి తీస్తే ఏ మ‌చ్చా క‌నిపించ‌నంత స్వ‌చ్ఛంగా మారిపోతారంతే.

ఎక్క‌డిదాకో ఎందుకు ఒక‌ప్పుడు దీదీ నీడ‌లో ఎదిగి త‌న‌తో విభేదించి కాషాయ‌పార్టీలో చేరి ఇప్పుడు బెంగాల్‌ని ఏలుతున్న సువేందు అధికారి క‌నిపించ‌డం లేదా..ఒక‌ప్పుడు డ‌బ్బు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సువేందు ఇప్పుడు బెంగాల్‌లో బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఆప‌ద్బాంధ‌వుడు. నిజాయితీకి లాల్చీ పైజామా తొడిగితే అది సువేందు అధికారినే. అదే కోవ‌లో ఇంకో నాయ‌కుడు బీజేపీకి జైకొట్ట‌గానే అన్ని స‌మ‌స్య‌ల‌నుంచీ విముక్తి ల‌భిస్తోంది. ఎంపీ, మాజీ క్రికెటర్ యూసుఫ్ ప‌ఠాన్ టీఎంసీకి గుడ్‌బై చెప్పి ఎన్డీయేకి మ‌ద్ద‌తివ్వ‌డ‌మే ఆల‌స్యం ఆయ‌న కోరుకున్న‌వ‌న్నీ జ‌రిగిపోతున్నాయి.

గుజ‌రాత్‌లో యూసుఫ్ ప‌ఠాన్ ఇంటికి అనుకుని ఉన్న 978 చ‌ద‌ర‌పు మీట‌ర్ల భూమి వివాదం రాత్రికి రాత్రే ప‌రిష్కార‌మైపోయింది. ఆ స్థ‌లాన్ని ప‌ఠాన్‌కి కేటాయించేందుకు గుజ‌రాత్ ప్ర‌భుత్వం ఆగ‌మేఘాల‌మీద ఆమోదాం తెలిపింది. 500 చ‌ద‌ర‌పు మీట‌ర్ల స్థ‌లాన్ని యూసుఫ్ ప‌ఠాన్‌కి బ‌హుమ‌తిగా ఇచ్చేసి, మిగిలిన 478 చ‌ద‌ర‌పు మీట‌ర్ల స్థ‌లాన్ని రాయితీ రేటుకు అమ్మ‌బోతోంది. అది కూడా ఏదో లెక్క‌కోస‌మే. 14ఏళ్లుగా ఆ స్థ‌లంకోసం పోరాడుతున్న యూసుఫ్ ప‌ఠాన్‌కి ఇప్పుడు త‌త్వం బోధ‌ప‌డింది. ఎన్డీయేకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌గానే ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయింది.

2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీగా గెల‌వ‌గానే యూసుఫ్ ప‌ఠాన్‌కి స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయి. ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించాల‌ని వ‌డోద‌ర కార్పొరేష‌న్ ఆయ‌న‌కు నోటీసులిచ్చింది. గుజ‌రాత్ హైకోర్టులో కూడా యూసుఫ్‌కి ఊర‌ట ల‌భించ‌లేదు. పైగా కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూ యూసుఫ్ ప‌ఠాన్ పిటిష‌న్‌ని తిర‌స్క‌రించింది. త‌ర్వాత త‌న అప్పీళ్ల‌ను వెన‌క్కితీసుకున్న యూసుఫ్ ప‌ఠాన్‌.. ఎంపీని చేసిన మ‌మ‌తాబెన‌ర్జీకి షాక్ ఇచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇంక స‌మ‌స్యేముంది. స్థ‌ల‌వివాదం క్ష‌ణాల్లో ప‌రిష్కార‌మైంది. ఇక‌పై ఆయ‌న ఏం కోరుకున్నా ఒళ్లోకొచ్చి వాలిపోయేలా ఉన్నాయి.