India US Relations: భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా భరోసా ఇచ్చింది. ఇతర దేశాలతో తమ సంబంధాల మెరుగపడుతున్నా భారత్‌తో బంధానికి ఎలాంటి నష్టం జరగదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియా స్పష్టం చేశారు. అమెరికా, పాకిస్తాన్ మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్న టైంలో ఈవ్యాఖ్యలు చేశారు రూబియో. భారత్‌తో పరస్పర సహకారానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రూబియో స్పష్టం చేశారు. తమకు భారత్‌తో పాటు.. పాకిస్తాన్‌తో కూడా సంబంధాలు అవసరమేనని చెప్పారు. పాక్‌తో తమకున్న సంబంధాలను భారత్‌కు సానుకూలంగా ఉపయోగించుకోవచ్చని అభిప్రయాపడ్డారు రూబియో. భారత్‌ను ఆందోళనకు గురిచేసే చర్యలను పాకిస్తాన్‌ నిరుత్సాహపరిచేలా తమ ప్రభావాన్ని ఉపయోగిస్తామని చెప్పారు. తమ ద్వారా ప్రాంతీయ ఘర్షణలు తలెత్తకుండా చూస్తామని స్పష్టం చేశారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు తమ నిబద్ధతకు నిదర్శమన్నారు.

రెండు రోజులు భారత్ పర్యటనలో ఉన్న రూబియో ప్రపంచంలో యుద్ధ వాతావరణంపై స్పందించారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోందన్నారు. ఈ యుద్ధానికి పరిష్కార మార్గం కనుగొనడం అంత సులువు కాదన్నారు. ఈ సమస్యకు పరిష్కరించడం తేలికై ఉంటే ఇప్పటికే యుద్ధం ముగిసిపోయేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను 1970నాటి అమెరికా విదేశాంగ విధానంతో సరిపోల్చడం సరికాదన్నారు రూబియో. అప్పట్లో ప్రచ్ఛన్న యుద్దం సహా అనేక పరిణామాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు పూర్తిగా మరిపోయాయని చెప్పారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌ హయాంలో సైనిక పాలకులకు వాషింగ్టన్ మద్దతుగా నిలిచింది.