లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగాక సభకు వచ్చారు రాహుల్ గాంధీ. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో రాహుల్ మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మణిపూర్‌లో మహిళలను హత్య చేయడమంటే భారత మాతను హత్య చేయడమేనని, మణిపూర్‌ను రెండు వర్గాలుగా విభజించారని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘స్పీకర్ సార్, లోక్ సభలో నన్ను పునర్నియమించినందుకు ధన్యవాదాలు. గతంలో నేను మాట్లాడినపుడు, నేను అదానీ మీద, మీ సీనియర్ నేతల మీద ఎక్కువ దృష్టి పెట్టాను. అందువల్ల నేను బహుశా మిమ్మల్ని బాధించి ఉంటాను.
ఈరోజు నేను అదానీ గురించి మాట్లాడను’’ అని చెప్పారు.హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న మణిపూర్ రాష్ట్రంలో తాను పర్యటించానని చెప్పారు. తాను సహాయక శిబిరాలకు వెళ్లానని, దురాగతాలను ఎదుర్కొన్న మహిళలతో తాను మాట్లాడానని తెలిపారు. కుమారుల మృతదేహాల వద్ద ఉన్న తల్లులతో మాట్లాడానని చెప్పారు. భయానక సంఘటనల గురించి చెప్పేటపుడు ఆ మహిళలు స్పృహ కోల్పోయారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఆ రాష్ట్రంలో పర్యటించలేదని ఆరోపించారు. బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించారన్నారు. ఆయన ఆ రాష్ట్రానికి ఎన్నడూ వెళ్లలేదన్నారు. మణిపూర్ ఇక ఉండబోదన్నారు.బీజేపీ నేతలు దేశభక్తులు కాదని, దేశ ద్రోహులు అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో అధికార పక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో భారత మాత హత్యకు గురైందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.సభలో గందరగోళం ఏర్పడింది. అంతేకాదు మరో వివాదంలో రాహుల్ గాంధీ చిక్కుకున్నారు. స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా మంత్రులు, ఎంపీలు.. స్మృతి ఇరానీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని రాహుల్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో లోక్ సభ సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు అధికారులు.