HomeNewsహైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్... భారీగా డ్రంక్...

హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్… భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

Published on

న్యూ ఇయర్ 2024 సందర్భంగా ఆదివారం రాత్రి మద్యం తాగి వాహనాలు నడిపిన 1241 మందిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత వారందరినీ కోర్టు ముందు హాజరు పరచనున్నారు. కొత్త సంవత్సరం వచ్చిందంటే యువత హంగామా అంతాఇంతా ఉండదు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గత రాత్రి రోడ్లపై యువత హంగామా చేశారు. పోలీసుల హెచ్చరికలు ఉన్నా.. పలువురు మందు పార్టీలు కూడా చేసుకున్నారు. మందు సేవించి రోడ్లపైకి వచ్చిన పలువురు మందుబాబులు పోలీసులకు చిక్కారు. న్యూఇయర్ రోజు పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వందలమంది మందుబాబులు పోలీసు చెకింగ్ లలో అడ్డంగా బుక్కయ్యారు. పట్టుబడిన మందుబాబుల వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోని 1241 కేసులను సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. అందులో 1239 మంది పురుషులు కాగా ఇద్దరు మహిళలపై కేసు నమోదు అయ్యింది. వీటిలో 938 ద్విచక్ర వాహనాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ద్విచక్ర వాహనాలు 938, త్రీ వీలర్స్ 21, ఫోర్ వీలర్స్ 275, హెవీ వెహికల్స్ 7 మొత్తం 1241 కేసులు నమోదు అయ్యాయి. పట్టుబడిన వారిలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న వారు 382 మంది ఉన్నారు. 26 సంవత్సరాలు నుంచి 35 వయసున్న వారు 536 మంది ఉన్నారు. సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఎక్కువగా మియాపూర్‌లో 253 కేసులు నమోదు కావడం విశేషం. అయితే డ్రగ్స్ కిట్‌తో టెస్టులు చేసినప్పటికీ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. న్యూసెన్స్, ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించినవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు పోలీసులు.

పోలీసులకు పట్టుబడ్డ వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకుని, MV చట్టం, 1988 సెక్షన్ 19 ప్రకారం సస్పెన్షన్ కోసం సంబంధిత RTAలకు పంపిస్తామని సైబరాబాద్ కమిషనర్, అవినాష్ మొహంతి తెలిపారు.సైబరాబాద్ వ్యాప్తంగా 74 ట్రాఫిక్ పోలీసుల బృందాలు డ్రంక్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించాయి.మొత్తం 509 మంది వ్యక్తులు 100 mg/100 ml కంటే ఎక్కువ ఆల్కహాల్ రీడింగ్ కలిగి ఉన్నారు మరియు 33 మందికి 300 mg కంటే ఎక్కువ మరియు 18 మంది వ్యక్తులు 500 mg కంటే ఎక్కువ రీడింగ్ కలిగి ఉన్నారు.మియాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, నార్సింగి, జీడిమెట్లలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల విస్తృతమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు ట్రాఫిక్ మరియు రహదారి భద్రత ప్రణాళికలతో సైబరాబాద్‌లో ఎక్కడా పెద్ద రోడ్డు ప్రమాదాలు జరగలేదు. రోడ్లపై భద్రత కల్పించడంలో పోలీసులకు సహకరించినందుకు పౌరులకు మొహంతి ధన్యవాదాలు తెలిపారు. పౌరుల భద్రత , డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి రాజీపడబోమని సీపీ తెలిపారు.

Latest articles

More like this