క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. CSKలో స్పెషల్ రోల్
MS Dhoni Retirement: ఇండియన్ స్టార్ ప్లేయర్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పారు. CSKకి మెంటార్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈసందర్భంగా ఎక్స్ వేదికగా CSK పోస్ట్ చేసింది.

MS Dhoni Retirement: చెన్నై సూపర్ కింగ్స్.. ఈ పేరు వినగానే గుర్తొచ్చే తొలి పేరు మహేంద్ర సింగ్ ధోనీ. పసుపు జెర్సీలో మైదానంలోకి అడుగుపెట్టే ఆ దిగ్గజాన్ని చూడగానే అభిమానుల కేరింతలు మిన్నంటుతాయి. తమిళ అభిమానులకు అతడు తలా.. యావత్ క్రికెట్ ప్రపంచానికి మాత్రం మిస్టర్ కూల్. సొంత రాష్ట్రం జార్ఖండ్ అయినా.. చెన్నై అభిమానుల గుండెల్లో ధోనీకి ఉన్న స్థానం ప్రత్యేకం. సీఎస్కే అంటే ధోనీ.. ధోనీ అంటే సీఎస్కే అనేంతగా ఈ అనుబంధం పెనవేసుకుంది. అలాంటి దిగ్గజం ఆటగాడిగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడంతో ఓ అద్భుత క్రికెట్ శకానికి తెరపడినట్లయింది. అయితే అభిమానులకు పూర్తిగా దూరం కాకుండా ధోనీ మరో కొత్త పాత్రలో కనిపించనున్నాడు. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
2008 నుంచి చెన్నైతో విడదీయలేని బంధం
ఐపీఎల్ ఆరంభమైన 2008లోనే ధోనీ సీఎస్కే జట్టులో భాగమయ్యాడు. అప్పటి నుంచి చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ జట్టుకు తిరుగులేని గుర్తింపు తీసుకొచ్చాడు. మధ్యలో రెండేళ్ల పాటు CSKపై నిషేధం విధించడంతో 2016, 2017 సీజన్లలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరఫున ఆడాడు. అయితే 2018లో చెన్నై తిరిగి ఐపీఎల్‌లోకి రావడంతో ధోనీ కూడా తన సొంత జట్టులోకి చేరాడు. ఆ సీజన్‌లోనే సీఎస్కేకు మరోసారి టైటిల్ అందించి తన నాయకత్వ పటిమను చాటుకున్నాడు. చెన్నైతో ధోనీ అనుబంధం కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. అందుకే ధోనీ మైదానంలోకి వస్తున్నాడంటే చాలు స్టేడియం మొత్తం ఈలలు, చప్పట్లతో హోరెత్తుతుంది. గెలుపోటములతో సంబంధం లేకుండా అతడికి అండగా నిలిచే అభిమానుల ప్రేమే ధోనీకి చెన్నైతో ఉన్న బంధాన్ని మరింత బలంగా మార్చింది.
endrum thala 💛
#ForOurThala https://t.co/VRmPKS2yEe
— Chennai Super Kings (@ChennaiIPL) November 17, 2026
ఐదు టైటిళ్లు.. ఎన్నో విజయాలు ఇచ్చిన ధోనీ
CSK కెప్టెన్‌గా ధోనీ ప్రస్థానం ఐపీఎల్ చరిత్రలోనే ఓ ప్రత్యేక అధ్యాయం. అతడి సారథ్యంలో చెన్నై 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఐదు ట్రోఫీలతో జట్టును అత్యున్నత స్థాయికి చేర్చిన ధోనీ.. ముంబై ఇండియన్స్‌తో కలిసి అత్యధిక టైటిళ్లు సాధించిన జట్లలో CSKను నిలిపాడు. ఐపీఎల్ విజయాలకే పరిమితం కాకుండా ఛాంపియన్స్ లీగ్ టీ20లోనూ ధోనీ తనదైన ముద్ర వేశాడు. 2010, 2014లో చెన్నై ఆ టోర్నీ టైటిళ్లను కైవసం చేసుకుంది. ఇక ధోనీ కెప్టెన్సీలో CSK ఏకంగా పదిసార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరడం అతడి నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. ముఖ్యంగా 2023 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి ట్రోఫీని అందుకోవడం చెన్నై అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని ఘట్టం.
చివరి ఓవర్లలోనూ మెరుపులే.. తగ్గని ధోనీ జోరు
2023 సీజన్ అనంతరం మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ధోనీ 2024లో తిరిగి మైదానంలోకి వచ్చాడు. అయితే అప్పటినుంచి అతడి బ్యాటింగ్ క్రమంలో మార్పు కనిపించింది. గతంలో టాప్ ఆర్డర్‌లో బరిలోకి దిగే ధోనీ.. ఆ తర్వాత చివరి ఓవర్లలో వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడే బాధ్యత భుజనా ఎత్తుకున్నాడు. 2023 సీజన్‌లో 104 పరుగులు చేసిన అతడు 182కు పైగా స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. 2024లో 11 ఇన్నింగ్స్‌ల్లో 161 పరుగులు సాధించి 220.54 స్ట్రైక్‌రేట్‌తో తన సత్తా చాటాడు. 2025 సీజన్‌లోనూ 14 మ్యాచ్‌లు ఆడి 196 పరుగులు చేశాడు. వయసు పెరుగుతున్నా.. మైదానంలో అతడి దూకుడు, బంతిని బౌండరీకి తరలించే తీరు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతూనే వచ్చాయి.
ఆటకు మాత్రమే దూరం.. CSK టీమ్‌కి కాదు
ఇకపై ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌తో మరో రూపంలో తన ప్రయాణాన్ని కొనసాగించనున్నాడు. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి జట్టు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. సహాయక బృందంలో కీలక బాధ్యతలు చేపడుతూ యువ ఆటగాళ్లకు తన అనుభవాన్ని పంచనున్నాడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడం, వారి ఆటతీరును మెరుగుపరచడం, జట్టు వ్యూహాల రూపకల్పనలో తనదైన సూచనలు ఇవ్వనున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, విజయాలను అందుకున్న ధోనీ అనుభవం కొత్త తరం ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడనుంది. అతడి నాయకత్వ లక్షణాలు, ఒత్తిడిని ఎదుర్కొనే విధానం, కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకునే తీరు సీఎస్కేకు భవిష్యత్తులోనూ అండగా నిలవనున్నాయి. ధోనీ కొత్త బాధ్యతలపై సీఎస్కే యజమాని శ్రీనివాసన్ కూడా స్పందించారు. ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఊహించలేమని పేర్కొన్నారు.
SOUND ON 🔊
The name is Dhoni
Mentor Dhoni, 007 Reloaded#ForOurThala https://t.co/e0H9podrjI
— Chennai Super Kings (@ChennaiIPL) November 17, 2026
అభిమానులకు కన్నీటి వీడ్కోలు
ఒకప్పుడు మైదానంలో ధోనీ సిక్సర్లు కొడుతుంటే ఈలలు వేసిన అభిమానులు.. ఇకపై అతడిని ఆటగాడిగా చూడలేకపోవడం బాధాకరమే. పసుపు జెర్సీలో ధోనీ బ్యాటింగ్‌కు దిగే క్షణాల కోసం ఎదురుచూసిన కోట్లాది మంది అభిమానులకు ఇది భావోద్వేగ వీడ్కోలు. అయితే ఆటగాడిగా అతడి ప్రస్థానం ముగిసినా.. సీఎస్కేతో ప్రయాణం మాత్రం ఆగిపోవడం లేదు. మైదానంలో హెలికాప్టర్ షాట్లతో అలరించిన ధోనీ.. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో తన అనుభవంతో యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయనున్నాడు. అభిమానుల కళ్లముందు మారేది అతడి పాత్ర మాత్రమే.. చెన్నైతో ఉన్న బంధం కాదు. ఆటగాడిగా ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన తలా.. ఇప్పుడు మెంటార్‌గా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. సీఎస్కే అభిమానుల గుండెల్లో మాత్రం ధోనీ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరదు.



