Hardik Pandya to Punjab Kings: హార్దిక్ పాండ్యా లేని ముంబై ఇండియన్స్‌ను ఊహించుకోగలమా.. ఆ జట్టుతో ఎన్నో ఏళ్ల అనుబంధం.. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగస్వామ్యం.. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో ముంబై అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ఆటగాడు ఇకపై మరో జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నాడు. ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో చోటుచేసుకున్న ఈ సంచలన పరిణామం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సుమారు రూ.18 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాబోయే సీజన్‌లో హార్దిక్ పంజాబ్ జెర్సీలో కనిపించనున్నాడు.

పంజాబ్ జట్టుకు మరింత బలం

పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా రాకతో ఆ జట్టు మరింత బలోపేతం కానుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణించగల సత్తా ఉన్న హార్దిక్.. జట్టుకు కీలక ఆటగాడిగా మారనున్నాడు. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో, దిగ్గజ కోచ్ రికీ పాంటింగ్ పర్యవేక్షణలో ఆడేందుకు హార్దిక్ ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ జట్టులోకి అధికారికంగా మారిన వెంటనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు హార్దిక్ సందేశం పంపినట్లు సమాచారం. ఈ సందర్భంగా పంజాబ్ జట్టుకు తన పూర్తి మద్దతు ఉంటుందని హార్దిక్ స్పష్టం చేశాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా తన భావోద్వేగాలను పంచుకుంటూ పంజాబ్ అభిమానులను ఉద్దేశించి ప్రత్యేక సందేశం ఇచ్చాడు. తన కెప్టెన్ శ్రేయస్, కోచ్ రికీ, తన పంజాబ్ జట్టు, ఆత్మీయులైన పంజాబీ ప్రజలరా అంటూ.. ప్రతి పోరాటంలో తాను కొండంత అండగా నిలబడతానన్నారు. హార్దిక్ చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

2015లో ముంబై జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన హార్దిక్

మరోవైపు ముంబై ఇండియన్స్‌తో హార్దిక్ పాండ్యాకు ఉన్న అనుబంధానికి ఈ ట్రేడింగ్‌తో ముగింపు పలికినట్లయింది. తొలిసారిగా 2015లో ముంబై జట్టులోకి అడుగుపెట్టిన హార్దిక్.. తన అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో అనతి కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ముంబై ఇండియన్స్ 2015, 2017, 2019, 2020 సీజన్లలో ఐపీఎల్ టైటిళ్లు సాధించడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్, కీలక సమయాల్లో వికెట్లు తీసే బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ ముంబైని వీడటంపై ఆ ఫ్రాంచైజీ కూడా భావోద్వేగంగా స్పందించింది. తమ జట్టు సాధించిన ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో భాగమైన హార్దిక్‌కు ప్రత్యేకంగా వీడ్కోలు పలికింది. అతడితో తమకున్న జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్ని సంవత్సరాల సేవలకు ధన్యవాదాలు హార్దిక్’ అంటూ తన పోస్టులో పేర్కొంది.

పంజాబ్‌ జట్టులో స్ట్రాంగ్ అవుతారా..?

ఒకవైపు ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ అనుబంధానికి తెరపడగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్‌లో కొత్త ప్రయాణానికి హార్దిక్ పాండ్యా సిద్ధమయ్యాడు. సుమారు రూ.18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ జట్టులోకి వచ్చిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ రాకతో ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు మరింత పటిష్టం కానున్నాయి. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో, రికీ పాంటింగ్ మార్గదర్శకత్వంలో హార్దిక్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.