నయా గోల్డ్ స్మగ్లింగ్.. బంగ్లా TO హైదరాబాద్ వయా ఏపీ
Gold Smuggling News: బంగారం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.

Gold Smuggling News: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ స్మగ్లింగ్ కలకలం రేపుతోంది. ఏపీని అడ్డాగా చేసుకున్న మాఫియా విజయవాడ కేంద్రంగా గోల్ స్మగ్లింగ్ కు పాల్పడుతోంది. ఈక్రమంలో విదేశాల నుంచి వస్తున్న బంగారం వరుసగా పట్టుబడుతోంది. గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా ఇటీవల పెద్ద ఎత్తున అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు DRI అధికారులు గుర్తించారు. గోల్డ్ స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. వరుసగా దాడులు చేస్తూ పెద్ద ఎత్తున బంగారం పట్టుకుంటున్నారు. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నారు.
ఎయిర్‌పోర్టులలో తరలిస్తున్న బంగారం పోలీసులకు వరుసగా పట్టుబడుతుండడంతో స్మగ్లర్లు రూటు మార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా విదేశాల నుంచి వచ్చిన బంగారాన్ని ఇప్పుడు రోడ్డు మార్గం ద్వారా తరలిస్తున్నారు. కమిషన్లతో ఎరవేసి అమాయకులను కొరియర్లుగా వాడుకుంటున్నారు. ఏపీని కేంద్రంగా చేసుకున్న గోల్డ్ మాఫియాలు భారత్ బాంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి కోల్‌కతాకు తరలించి అక్కడి నుంచి వయా విశాఖ, విజయవాడ మీదుగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన పోలీసులు గోల్డ్ మాఫియా నయా స్మగ్లింగ్ ను కనిపెట్టారు. వారి రూట్‌లోనే దాడులు చేస్తున్నారు. విజయవాడ – హైదరాబాద్ రూట్‌పై నిఘాపెట్టారు. బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో 15 రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు ఆపరేషన్లలో 14 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్ చేశారు. ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు. నయా గోల్డ్ స్మగ్లింగ్ వెనుక ఉన్న మాఫియా డాన్ ఎవరనే దానిపై విచారణ చేస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్‌కు ప్రత్యేకంగా ఏపీనే ఎందుకు ఎంచుకున్నారనే దానిపై DRI ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఈనెల 8న కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు ఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్న కారును విశాఖపట్నం దగ్గర అధికారులు అడ్డుకున్నారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేసి సీటు కింద ప్రత్యేకంగా రూపొందించిన రహస్య అరలు బయటపడ్డాయి. అందులో మూడు ప్యాకెట్లలో 8 కోట్ల విలువ చేసే 5.83 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ విజయవాడ శివార్లలో మరో స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ స్కార్పియో వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేశారు. వాహనంలోని రహస్య అరలో దాచిన 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ బంగారం అమ్మగా వచ్చిన విదేశీ కరెన్సీగా గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ కు బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు బంగారం క్యారియర్‌లను టోల్‌ప్లాజా దగ్గర అదుపులోకి తీసుకున్నారు. నడుముకు కట్టుకున్న పౌచ్‌లో దాచిన మూడు కేజీల విదేశీ బంగారు బార్లను స్వాధీనం చేసుకున్నారు.



