వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. సంచలన దర్శకుడు ఆర్జీవీ ‘వ్యూహం’ మూవీకి సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది. అయితే.. ఈ సినిమాలోని పాత్రలకు నిజ జీవితాల్లో ఉన్న నేతల పేర్లను పెట్టడంపై అభ్యంతరం తెలిపింది బోర్డు.. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. కాగా, తాజా రాజకీయాల నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో సరిఫికెట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఒక వర్గానికి పూర్తిగా మద్దతు ఇచ్చినట్లు చూపించడంతో రాజకీయాలపై ప్రభావం పడే చాన్స్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యూహం,శపధం అనే భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం వ్యూహం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు ఆర్జీవీ. అలాగే శపథం మూవీని జనవరి 25న శపథం సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. కుట్రలకీ, ఆలోచనలకు మధ్య అసమాన్యుడిగా ఎదిగిన వైఎస్ జగన్ కథతో ఈ రెండు సినిమాల్ని తెరకెక్కించబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు.తాజాగా సెన్సార్ బోర్డు షాకివ్వడంతో వర్మ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది హాట్ టాపిక్ అవుతోంది.