ఈ సారి దశమహా విద్యా గణపతిగా దర్శనమిచ్చాడు ఖైరతాబాద్ గణేశుడు.. 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథుడిని చూడాలంటే రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. ఏటా జరిగే గణేష్ నవరాత్రులు శోభాయమానంగా ముగుస్తున్నాయి. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం వైభవంగా సాగుతోంది. ఖైరతాబాద్ మహా గణపతిని లక్షలాదిమంది దర్శించుకున్నారు. జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నారు. క్రేన్ నెంబర్-4 వద్ద చివరి పూజలు అందుకున్న తర్వాత సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నిమజ్జనం పూర్తి అయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో క్రేన్ నెంబర్-4 వద్దకు మహాగణపతి రాగానే గంటపాటు వెల్డింగ్ పనుల అనంతరం గణనాథుడిని నిమజ్జనం చేశారు.
మహాగణపతి నిమజ్జనోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా జనం క్రేన్‌నెంబర్-4 వద్దకు చేరుకున్నారు. బై బై గణేషా అంటూ ఘనంగా బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు భక్తజనసంద్రంగా మారిపోయాయి. మహాగణపతి నిమజ్జనానికి రెండు భారీ క్రేన్లను ఉపయోగించారు.. గతంలో జంట నగరాల్లోని వినాయక నిమజ్జనం ముగిశాక చివరిలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉండేది. చివరిలో బడా గణేష్ నిమజ్జనం పెట్టుకుంటే ఇబ్బంది తలెత్తుతోందని ముందుగానే నిర్వహిస్తున్నారు. కాగా.. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రలో బ్యాండ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
అలాగే మహాగణపతి నిమజ్జనోత్సవంలో పోలీసుల హడావుడిపై గణేష్ ఉత్సవ నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర ఏడు గంటలపాటు నిర్విరామంగా కొనసాగింది. దారి పొడువుగా గణపయ్యకు భక్తులు నీరాజనాలు పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గణేష్ శోభాయాత్ర మొదటిరోజే మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.