YS Jagan Letter to Sharmila:

నాకు ఇష్టం లేదు.. (YS Jagan ): షర్మిల కుమార్తె పెళ్లి విషయంలో జరుగుతున్న కాంట్రవర్సీపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఆరోపణలను కొట్టిపడేస్తూ చెల్లెలు షర్మిలకు జగన్ సుదీర్ఘమైన లేఖ రాశారు.
షర్మిల కుమార్తె అంజిలి పెళ్లి గురించి తెలిసి తనకు చాలా సంతోషంగా ఉందని జగన్ లేఖలో ప్రస్తావించారు. గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని పరిణామాలు జరిగినా, అంజిలి జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆశించారు. నా అభ్యంతరాలను పట్టించుకోకుండా బెంగళూరులోని నా నివాసంలోనే పెళ్లి నిర్వహించాలని నువ్వు భావిస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందన్నారు. నేను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి నిర్వహించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని లేఖలో రాశారు. విషయాన్ని ఇప్పటికే వివిధ వ్యక్తుల ద్వారా నీకు తెలియజేశానన్నారు. పెళ్లి వంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారన్నారు. క్యాటరింగ్‌, డెకరేషన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, అతిథులు ఇలా ఎంతోమంది ప్రాంగణంలోకి వస్తారు. వీరిలో చాలామంది మనకు కనీసం పరిచయం కూడా లేని వ్యక్తులే ఉంటారు.. ఇంతమంది నివాస ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయన్నారు. నివాస ప్రాంగణానికి, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లడం భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తుందన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు అంత సులభం కాలేదన్నారు.

నా భద్రతే నాకు ముఖ్యం(YS Jagan Letter to Sharmila)
జిలీ (అంజలి) చిన్నప్పటి నుంచి పెరుగుతూ రావడాన్ని నేను దగ్గరగా చూశానన్నారు జగన్ (YS Jagan ). ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని ఆశించారు. అయినప్పటికీ తన కుటుంబ భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ముప్పులను ఏమాత్రం విస్మరించలేనని స్ఫష్టం చేశారు. తన కుమార్తెలు (హర్ష లేదా వర్ష) పెళ్లి విషయంలో కూడా నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడినన్నారు జగన్‌. ప్రస్తుతం నేను ఇక్కడే నివసిస్తున్నాను.. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల అనవసరంగా అందరి దృష్టి ఈ నివాసంపై పడుతుందని లేఖలో పేర్కొన్నారు. చివరకు ఇది నా ఇల్లు. ఇక్కడ నేను, నా కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు. భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలను ఇప్పటికే నీకు తెలియజేసినా, నా అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం నన్ను బాధించిందని చెప్పారు.

లోటస్ పాండ్‌లో చేసుకో..(YS Jagan Letter to Sharmila)
ఈ విషయంలో నా పరిస్థితిని, అభిప్రాయాన్ని మరోసారి పరిగణనలోకి తీసుకుని పెళ్లి కోసం మరో వేదికను ఎంచుకోవాలని షర్మిలను లేఖలో జగన్ (YS Jagan )కోరారు. రాజా పెళ్లి చేసినట్లుగానే కన్వెన్షన్‌ సెంటర్‌లో గానీ, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వేదికలో గానీ పెళ్లి నిర్వహించుకోవాలని సూచించారు. అలాంటి వేదికలు ఇష్టం లేకపోతే హైదరాబాద్‌లోని నా లోటస్‌ పాండ్‌ ఆస్తిని పెళ్లికి ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చానని చెప్పారు. లోటస్‌ పాండ్‌ ఆస్తిని ఉపయోగించుకోవడానికి ఇచ్చిన ప్రతిపాదన ఇప్పటికీ అలాగే ఉందన్నారు. జిలీ (అంజలి) పెళ్లి ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జగన్‌ తెలిపారు. భవిష్యత్తులో ఆ రోజును ఆమె ఎంతో ఆనందంగా గుర్తుచేసుకోవాలని ఆశిస్తున్నానని.. అందుకోసం సహేతుకంగా నేను చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను..ఈ విషయంలో నువ్వు కూడా నా దృక్కోణాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నానంటూ షర్మిలకు జగన్ సుదీర్ఘమైన లేఖ రాశారు. జగన్‌ లేఖ తర్వాత షర్మిల ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.