President Droupadi Murmu at Saras Mela Vijayawada: విజయవాడలో జాతీయ సరస్ మేళా -2026 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈకార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు శివరాజ్‌ సింగ్ చౌహాన్‌, రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరస్ మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్ట్రపతి ముర్ము పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలతో మాట్లాడారు. వారు తయారు చేసిన సహజ ఉత్పత్తులు చేనేత వస్తువులు, హ్యాండీ క్రాఫ్ట్‌లను ముర్ము వీక్షించారు. ఉత్పత్తుల ప్రత్యేకతను డ్వాక్రా సంఘాలను అడిగి తెలుసుకున్నారు. ఓ స్టాల్‌లో చీరను కొనుగోలు చేశారు. డిజిటల్ చెల్లింపులు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముర్ము మాట్లాడారు. విజయవాడకు రావడం సంతోషంగా ఉందన్నారు. సరస్‌ మేళాను ప్రారంభించడం.. దుర్గమ్మను దర్శించుకోవడం మరచిపోలేని అనుభూతి అన్నారు.

రాష్ట్ర పతి ద్రౌపతి ముర్ము జీవితం ప్రతీ ఆడబిడ్డకు ఆదర్శమని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టుదల ఉంటే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా చేరుకోవచ్చని ముర్ము నిరూపించారని ప్రసంశించారు. ఇది నారీ శక్తి .. నవ భారత్ శక్తి అన్నారు. వికసిత్ భారత్‌కు పునాది అని సీఎం చెప్పారు. గ్రామీణ మహిళల ఆదాయం పెంచడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడడే సరస్ మేళా లక్ష్యమని సీఎం తెలిపారురు. 2047 వికసిత్ భారత్‌కి అందరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.