చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

PK Meets CBN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస భేటీలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అభ్యర్థుల ఎంపికతో పాటు సీట్ల సర్దుబాటు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. రెండు రోజుల వ్యవధిలో వరుసగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. గురువారం ఎలాంటి పోలీసు కాన్వాయ్ లేకుండా పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు, నామినేషన్ల ప్రక్రియ, స్థానిక ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తాజాగా శుక్రవారం మరోసారి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఈ భేటీలో చర్చ జరిగి ఉండవచ్చనే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది..
పదవికి రాజీనామా.. ఖండించిన జనసేన (PK Meets CBN)
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం కలకలం రేపింది. పోలీసు కాన్వాయ్ లేకుండా ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ రాజీనామా చేయడానికే చంద్రబాబు నివాసానికి వెళ్లారంటూ సోషల్ మీడియాతో పాటు.. వాట్సాప్ గ్రూపుల్లో వార్త సంచలనంగా సర్క్యూలేట్ అయ్యింది. దీంతో రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశంపై చర్చ మొదలైంది. అయితే ఈ ప్రచారంపై డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించింది. పవన్ కళ్యాణ్ రాజీనామా చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబును పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కలిశారని పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. మరోవైపు స్థానిక ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న వరుస సమావేశాలు కూటమి రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ప్రచారంపై దృష్టి సారించిన నేతలు
ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి మధ్య సీట్ల పంపకాలు పూర్తవడంతో పాటు, నామినేషన్ల ఘట్టం చివరి దశకు చేరింది. ఈ క్రమంలో ప్రచారాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచారం చేయాలని అధినాయకులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎన్నికల ప్రచారంలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


