Jagan: స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకెళ్తామని ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని, విచారణ సందర్భంగా ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు ధర్మాసనం మొట్టికాయలు వేసిందని గుర్తు చేసుకున్నారు. నామినేషన్ వేయనివ్వకపోవడం అంటే వ్యవస్థ దిగజారిపోవడమేనని, చివరకు నామినేషన్లు వేయించమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

23 చోట్ల నామినేషన్లు అడ్డుకున్నారు: జగన్(Jagan) 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 23 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయనివ్వకుండా కూటమి నేతలు అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. 15 ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు లేకుండా చేశారని మండిపడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో వార్డు సభ్యులు నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడ్డారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. కూటమి ప్రభుత్వం మంచి చేసి ఉంటే ప్రజలను ఓట్లు అడగలేకపోతోందని ప్రశ్నించారు. “మహాభారతంలో శకుని పాచికలు వేసినట్టుగా.. ఎన్నికలను సీఎం చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు. ఇక్కడ మాత్రమే పోటీ చేయాలన్నట్లుగా రూల్ పాస్ చేస్తున్నారు” అంటూ జగన్ నిప్పులు చెరిగారు.

నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లాం

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారని, ఆయన సమయంలోనే తాము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లినట్లు జగన్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు దౌర్జన్యంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పుంగనూరు, రాయచోటి, బద్వేల్‌లో నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఏపీలో జంగిల్ రాజ్ పాలన సాగుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు.