HomePoliticsఏపీలో టీడీపీ-బీజేపీ ఒకవేళ కలుస్తాయేమో .. మాజీ ఎంపీ ఉండవల్లి హాట్ కామెంట్స్

ఏపీలో టీడీపీ-బీజేపీ ఒకవేళ కలుస్తాయేమో .. మాజీ ఎంపీ ఉండవల్లి హాట్ కామెంట్స్

Published on

ఏపీ రాజకీయాలపై తనదైన రీతిలో కామెంట్లు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మారిశెట్టి మురళీ కుమార్ రాసిన ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభలో ఎవరెవరు?పుస్తక సమీక్షకార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. 1952 నుంచే కమ్మ, రెడ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైందన్నారు. 1952 తర్వాత కమ్మవారి ప్రాతినిధ్యం,ప్రాబల్యం లేని క్యాబినెట్ ఇదేనన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకు ప్రాధాన్యం ఉండేదన్నారు. ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీలో కమ్మవారికే ప్రాధాన్యం ఉండేదని వెల్లడించారు.నాడు-నేడు కమ్మ,రెడ్లదే రాజకీయంగా ఆధిపత్యమన్నారు. ఏపీలో యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్ మొదలుపెట్టింది త్రిపురనేని రామస్వామి చౌదరి అని తెలిపారు.

ఎప్పటి నుంచో ఉన్న ఒత్తిడి కారణంగానే రంగా హత్య సమయంలో విధ్వంసం జరిగిందన్నారు. ఓటును వెయ్యికి, రెండు వేలకు అమ్మకుండా మనమే అడ్డుకోవాలన్నారు.అపార్ట్ మెంట్లలో ఉన్నవారంతా హోల్ సేల్ గా బేరం మాట్లాడేసుకుంటున్నారని చెప్పారు. అధికారంలోకి రావడానికే రాజకీయాలు అనే పరిస్థితి పోవాలన్నారు. ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవికి 16 శాతం ఓట్లు వచ్చాయన్నారు. పార్టీని కాపాడుకోవాలని చిరంజీవికి చెప్పానన్నారు. పార్టీని విలీనం చేసే సమయంలోనూ బయటి నుంచి మద్దతివ్వండి కానీ కలపొద్దని సలహా ఇచ్చానని గత సంగతుల్ని వివరించారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఎవరు దేనికి అర్హులో అదే వారికి వస్తుందన్నారు. ఈసారి కమ్మవారు మంత్రిగా లేనిది ఈ విడతలోనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.1952 నుంచి కమ్మ, రెడ్డి ఆధిపత్య పోరు ఉందన్న ఆయన.కాంగ్రెస్ పార్టీలో కులాల సమతౌల్యం ఉండేది.ఈ పుస్తకం చదివిన వారు నియోజకవర్గాల వారీగా కుల ప్రయోజనాలు తెలుస్తాయి అన్నారు ఉండవల్లి.

రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ ఒకవేళ కలుస్తాయేమో అన్నారు. ఎన్టీఆర్‌పై వంద రూపాయల కాయిన్ ప్రారంభించడం మంచిదే.కానీ, లక్ష్మీపార్వతిని పిలవకపోవడం సరైంది కాదన్నారు. పొలిటికల్ గా పొత్తులు సహజం అనీ, వాటిపై మరోసారి మాట్లాడతానన్నారు ఉండవల్లి.పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు ఉండవల్లి. మరో అతిధిగా విచ్చేసిన శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, శాసనసభలో ఎలా మాట్లాడాలో సభ్యులకు తెలియడం లేదన్నారు. స్పీకర్లే శాసనసభ భాషను మరిచి మాట్లాడుతున్నారన్నారు. సభలో అసభ్యంగా మాట్లాడితే తోటి సభ్యులు చప్పట్లు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు జాగర్లమూడి రామకృష్ణ, ఎంవీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కటాలీ అప్పారావు, ఏఎన్ఆర్ వైర్మన్ అరవ రామకృష్ణ.. ఏపీయూడబ్బుతో రాష్ట్ర కార్యదర్శి చందు జనార్ధన్, పాత్రికేయులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.మంచి ఉపయుక్తమయిన పుస్తకం రాసిన రచయిత, సీనియర్ జర్నలిస్ట్ మారిశెట్టి మురళీకుమార్ ని పలువురు అభినందించారు.

Latest articles

More like this