MPTC, ZPTC Results

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 365 కేంద్రాలను భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 18,843 మంది ఎంపీటీసీ అభ్యర్థులు, 2,169 మంది జడ్పీటీసీ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం సిద్ధమైంది. కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 365 కౌంటింగ్ కేంద్రాల్లో 9,062 టేబుళ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 11 వేల మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 28,692 మంది కౌంటింగ్ సహాయక సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 40,679 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. స్ట్రాంగ్ రూముల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తీసుకొచ్చిన తర్వాత మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టి, ఆపై సాధారణ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో 70.72 శాతం ఓటింగ్ నమోదైంది. వరదలు, తీవ్ర వర్షాల వల్ల పోలింగ్ వాయిదా పడ్డ 5 మండలాల్లో శుక్రవారం నిర్వహించారు. పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,480 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గాను 2,128 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 8,349 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.