Israel Political Crisis: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ప్రధానిగా కొనసాగిన బెంజమిన్ నెతన్యాహు అధికారం కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్నటివరకు అరబ్ పార్టీల మద్దతు తీసుకునేందుకు ఇష్టపడని ఇజ్రాయెల్ రాజకీయ పార్టీలు.. ఇప్పుడు అదే పార్టీలతో చేతులు కలుపుతున్నాయి. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపింది. ఆర్మీ మాజీ చీఫ్ గడీ ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీలు మద్దతు ప్రకటించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది.

ఐసెన్‌కోట్‌కు 67 మంది ఎంపీల మద్దతు

ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ను కలిసి అరబ్ పార్టీలు గడీ ఐసెన్‌కోట్ పేరును ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించాయి. ఆయనకు మద్దతుగా మొత్తం 67 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు పత్రాలను అధ్యక్షుడికి అందించారు. దీంతో ఐసెన్‌కోట్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని అధ్యక్షుడు ప్రకటించారు. ఈ పరిణామంతో ఐసెన్‌కోట్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు పెరిగాయి.

19 స్థానాలతో కింగ్‌మేకర్లుగా అరబ్ పార్టీలు

ఇజ్రాయెల్ పార్లమెంటులో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో అరబ్ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం 19 స్థానాలతో ఉన్న అరబ్ పార్టీలు ఐసెన్‌కోట్‌కు మద్దతు ప్రకటించడంతో రాజకీయంగా కింగ్‌మేకర్లుగా మారాయి. గత పది రోజులుగా ఐసెన్‌కోట్ అరబ్ పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు ఫలించడంతో ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు లభించింది. మరోవైపు బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మొత్తం 120 స్థానాలున్న పార్లమెంటులో నెతన్యాహు పార్టీ 53 స్థానాలకే పరిమితమైంది. మిత్రపక్షం తటస్థంగా ఉండటంతో ఆయనకు మద్దతు మరింత తగ్గి 46 స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకోవడం నెతన్యాహుకు కష్టంగా మారింది.

కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ

ఒకవైపు అరబ్ పార్టీల మద్దతుతో గడీ ఐసెన్‌కోట్ 67 మంది సభ్యుల బలాన్ని కూడగట్టుకోగా.. మరోవైపు నెతన్యాహు సంఖ్యాబలం తగ్గిపోయింది. దీంతో ఇజ్రాయెల్‌లో అధికార మార్పిడి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఐసెన్‌కోట్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే నెతన్యాహు పాలనకు తెరపడినట్లే అవుతుంది. అంతేకాకుండా నెతన్యాహు హయాంలో చేసిన యుద్ధాలతో పాటు.. హమాస్‌ దాడులపై పూర్తిస్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.