France Protests: ఫ్రాన్స్‌లో ఆందోళనలు మరింత ఉధృతంగా మారుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న నిరసనలు మిన్నంటుతున్నాయి. పది రోజుల క్రితం పారిస్‌ను భయపెట్టిన నిరసనకారులపై మెక్రాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వేలాది మందిని అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. ఈ క్రమంలో మరోసారి నిరసనకారులు పారిస్‌ను ముట్టడించారు. వందలు, వేలు కాకుండా ఆరు లక్షల మంది పారిస్‌ను ముట్టడించడంతో నగరం అట్టుడికిపోయింది. వేతనాలు, పెన్షన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో విద్యార్థులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వేలాది మంది నినాదాలతో వీధులను హోరెత్తించారు. పారిస్‌తో పాటు లియోన్‌, మార్సెయిల్‌ వంటి ప్రధాన నగరాల్లోనూ నిరసనలు ఉధృతంగా కొనసాగాయి.

జీతాలు పెంచాలి.. పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్

పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక ఇబ్బందులకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందించే పెన్షన్లను కూడా పెంచాలని విశ్రాంత ఉద్యోగులు కోరుతున్నారు. విద్యార్థులు సైతం ఈ ఆందోళనలకు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ విధానాలు సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని నిరసనకారులు ఆరోపించారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, కొంతమంది నిరసనకారులు రెచ్చిపోతున్నారు. పోలీసులపై దాడులకు పాల్పడటంతో పాటు పలు షాపుల్లో లూటీ చేస్తున్నారు. ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న షాపులను లూటీ చేయడంతో యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూతపడిన ఈఫిల్ టవర్.. నిలిచిపోయిన రవాణా

భారీ నిరసనల నేపథ్యంలో పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం ఈఫిల్ టవర్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. గతంలో పారిస్‌లో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న మార్కెట్ ప్లేస్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో ఈఫిల్ టవర్‌ను అధికారులు మూసివేశారు. సమీప పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఫ్రాన్స్‌ వ్యాప్తంగా అనేక పాఠశాలలు మూతపడగా, ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. రైళ్లు, బస్సుల సేవలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.

70 వేల మంది పోలీసులతో భారీ భద్రత

ఆందోళనలు హింసాత్మకంగా మారకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. సుమారు 70 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించింది. నిరసనకారులను నియంత్రించే క్రమంలో పలు ప్రాంతాల్లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. విద్యార్థులు, కార్మికులు, పెన్షనర్లు ఒకే వేదికపైకి రావడంతో ఫ్రాన్స్‌లో ఈ నిరసనలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. ప్రజల ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. నిరసనల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.