ECI Offers Fresh Chance to Voters: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన అర్హులైన ఓటర్లకు మరో అవకాశం కల్పించింది. గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించినవారు, డూప్లికేట్ కేటగిరీల్లో గుర్తించి, ఎన్యుమరేషన్ ఫారాలు అందక జాబితాలో చోటు దక్కని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని ASDD కేటగిరీ ఓటర్ల జాబితాలను సంబంధిత పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల్లో మరోసారి ప్రదర్శించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోవడానికి గల కారణాలను కూడా వెల్లడించాలని సూచించింది. ఈ జాబితాలను ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల వెబ్‌సైట్లలో PDF రూపంలో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.

ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు మరో అవకాశం

అర్హులైన ఓటర్లు తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లు చేర్చుకునేందుకు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించవచ్చు. సంబంధిత ఓటర్లకు పాక్షికంగా నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను ECINETలో తిరిగి జనరేట్ చేయాలని ఈసీ ఆదేశించింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను సంప్రదించి ఫారాలు అందజేయాలి. వాట్సాప్, ఈ-మెయిల్, SMS ద్వారా కూడా ఫారాలు పంపించే అవకాశం కల్పించాలని సూచించింది. అలాగే, పాత EPIC నంబర్‌ను నమోదు చేసి ఎన్నికల సంఘం వెబ్‌సైట్ లేదా ECINET యాప్ ద్వారా ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని సమర్పించవచ్చని తెలిపింది. గతంలో అదే నివాసంలో ఉన్నప్పటికీ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించలేకపోయిన వారు, ఫారంతో పాటు ఎందుకు ముందుగా సమర్పించలేకపోయారో వివరిస్తూ అనుబంధం-B ప్రకటన ఇవ్వాలి. రాష్ట్రంలోనే మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్నవారు ఫారం-8 సమర్పించాల్సిన అవసరం లేదు. కొత్త చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గ వివరాలతో కూడిన ఎన్యుమరేషన్ ఫారం, అనుబంధం-C ప్రకటన, చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. కొత్త ప్రాంతంలోని BLOను సంప్రదించి కూడా సహాయం పొందవచ్చు.

బీఎల్వోతో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక సదుపాయం

ఓటర్లకు సహాయం అందించేందుకు ECINET యాప్‌లో బీఎల్వోలతో మాట్లాడే సదుపాయాన్ని అందుబాటులో ఉంచారు. దీని ద్వారా నేరుగా బూత్ లెవల్ ఆఫీసర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చు. ఇళ్లు లేని వారికి చిరునామా రుజువు పత్రాలు లేకపోతే బీఎల్వోలు క్షేత్రస్థాయి ధ్రువీకరణ నివేదిక ఆధారంగా పరిశీలన చేపట్టవచ్చని ఈసీ తెలిపింది. ఓటర్లు సమర్పించిన ఫారాలను పరిశీలించి, వారి అర్హత, సాధారణ నివాసం తదితర వివరాలను ధ్రువీకరించిన తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROలు) నిర్ణయం తీసుకుంటారు. ఆమోదించిన దరఖాస్తులను తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేకంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. గతంలో ఉన్న EPIC నంబర్‌నే తిరిగి కేటాయించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే SIR ప్రక్రియలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 సమర్పించిన వారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఆదేశాలు

ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి పవన్ దివాన్ సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. ఈ ఆదేశాలు ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, నాగాలాండ్‌లకు వర్తించనున్నాయి. ఈ ప్రక్రియపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి, అర్హులైన ఏ ఒక్క ఓటరూ ఓటు హక్కు పొందే అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినంత మాత్రాన తిరిగి నమోదు నిరాకరించినట్లు కాదని స్పష్టం చేసింది. నిర్దేశించిన విధానంలో దరఖాస్తు చేసుకుని అర్హతను నిరూపించుకుంటే తుది ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకునే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

13 కోట్ల ఓట్లపై ప్రతిపక్షాల ఆరోపణలు

ఇప్పటికే దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అందులో మరణించిన వారితో పాటు.. డబుల్ ఎంట్రీ ఉన్నవారు, అడ్రస్‌ లేని వారివి ఉన్నాయంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. అయితే కుట్ర పూరితంగా సీఈసీ జ్ఞానేష్‌కుమార్ 13 కోట్ల ఓట్లను తొలగించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటు కోల్పోయిన వారికి ప్రత్యేక అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు 13 కోట్ల మంది ఓటర్లలో ఎంతమంది తిరిగి అప్లై చేసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది..