హద్దులు లేని ప్రవచనాలు.. దేవుళ్ల మధ్య పోలికలు
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ రామకథ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి రూపాలు, భంగిమలు, ఆయుధాలు, అవతారాల గురించి ఆయన చేసిన పోలికలు కృష్ణ భక్తుల ఆగ్రహానికి కారణమయ్యాయి.

Dhirendra Shastri Controversy
భక్తి అంటే భగవంతుడిపై ప్రేమ.. ఆధ్యాత్మిక ప్రవచనం అంటే ఆ భక్తి తత్వాన్ని ప్రజలకు వివరించే వేదిక. అలాంటి పవిత్రమైన వేదికపై మాట్లాడే ప్రతి మాటకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కోట్లాది మంది ఆరాధించే దేవుళ్ల గురించి మాట్లాడేటప్పుడు మరింత భాద్యతగా మాట్లాడాలి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ రామకథ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (Dhirendra Shastri Controversy)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి రూపాలు, భంగిమలు, ఆయుధాలు, అవతారాల గురించి ఆయన చేసిన పోలికలు కృష్ణ భక్తుల ఆగ్రహానికి కారణమయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కరేరాలో అక్టోబర్ 29న నిర్వహించిన రామకథ కార్యక్రమంలో ఈ వివాదం మొదలైంది. ప్రవచనంలో భాగంగా శ్రీకృష్ణుడి త్రిభంగ భంగిమను ప్రస్తావించారు ధీరేంద్ర శాస్త్రి. కృష్ణుడు మూడు చోట్ల వంగి నిలబడతారని, వేణువు ఊదుతారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో శ్రీరాముడు నిటారుగా నిలబడతారని, నేరుగా నడుస్తారని ఇద్దరి రూపాలను పోల్చారు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి. వేణువు ఊదడం ఒక ఆట అయితే.. ధనుస్సు ఎత్తడం సాధారణ విషయం కాదన్న భావనలోనూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం ఒక్కసారిగా రాజుకుంది.
భంగిమపై వివాదం
అసలు శ్రీకృష్ణుడి త్రిభంగ భంగిమ అంటే భారతీయ శిల్పకళ, నృత్య సంప్రదాయాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన భంగిమ ఇది. శరీరాన్ని మూడు చోట్ల వంచి నిలబడే ప్రత్యేకమైన ఆకృతి. కృష్ణుడు వేణువు చేతబట్టి ఈ భంగిమలో దర్శనమివ్వడం భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన రూపం. ఇందులోని సౌందర్యం, లయ, దైవత్వం భక్తి సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఈ భంగిమను ప్రస్తావిస్తూ శ్రీకృష్ణుడిని వంగిన రూపంగా, శ్రీరాముడిని నిటారుగా ఉండే రూపంగా ధీరేంద్ర కృష్ణ శాస్త్రి (Dhirendra Shastri Controversy)పోల్చడాన్ని మథుర, బృందావన్ ప్రాంతాలకు చెందిన సాధువులు, కృష్ణ భక్తులు తప్పుబట్టారు. రాముడు, కృష్ణుడు ఇద్దరూ విష్ణుమూర్తి అవతారాలేనని.. ఒకరి గొప్పతనాన్ని చెప్పడానికి మరొకరి రూపాన్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. శ్రీకృష్ణుడి వేణుగానాన్ని సాధారణమైనదిగా పోల్చడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
క్షమాపణ చెప్పిన శాస్త్రి
తాను చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడం, తీవ్ర వ్యతిరేకతకు దారితీయడంతో ధీరేంద్ర శాస్త్రి వివరణ ఇచ్చారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి మధ్య ఎలాంటి భేదం చూపించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తాను కూడా శ్రీకృష్ణుడి భక్తుడినేనని, కృష్ణుడిని వ్యతిరేకించే వ్యక్తిని కాదన్నారు. బ్రజ్ ప్రాంతంలోని భక్తి సంప్రదాయంలో దేవుడితో ప్రేమగా, చనువుగా మాట్లాడే విధానం ఉంటుందని.. ఆ సందర్భంలోనే తన వ్యాఖ్యలు చేశానని వివరించారు. అయినప్పటికీ తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని ధీరేంద్ర శాస్త్రి(Dhirendra Shastri Controversy) కోరారు.
రాజకీయ రచ్చ
ఆధ్యాత్మిక వేదికపై మొదలైన ఈ వివాదం క్రమంగా రాజకీయ రగడకు మారింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ .. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వ్యాఖ్యలను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తాయని, వివాదాస్పద ప్రవచనకర్తల కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం ధీరేంద్ర శాస్త్రి (Dhirendra Shastri Controversy) వ్యాఖ్యలను తప్పుబట్టారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పరస్పర విరుద్ధులు కాదని, ఒకే దైవతత్వానికి ప్రతిరూపాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను కూడా విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కృష్ణుడితో యాదవ సామాజిక వర్గానికి ఉన్న సాంస్కృతిక అనుబంధం కారణంగా ఈ అంశానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
ये सनातन विरोधी किसके कहने पर सक्रिय है। पहले भगवान कृष्ण के बारे में विवादित वीडियो आया अब भगवान राम के पिता के बारे अभद्रता की बात प्रसारित हो रही है। इसके राजनीतिक आकाओं को ये सब मंजूर होगा, हमें अंश मात्र भी स्वीकार्य नहीं है।
सामाजिक सौहार्द बिगाड़ने के अपराध में इसके सभी कार्यक्रम रद्द किये जाएं। अब सच्चे सनातनी इनकी पर्ची लिखेंगे।
— Akhilesh Yadav (@yadavakhilesh) November 3, 2026
కోర్టులో కేసు
మరోవైపు ఈ వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరింది. న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్.. ధీరేంద్ర శాస్త్రి(Dhirendra Shastri Controversy)పై ఆగ్రా సివిల్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. శ్రీకృష్ణుడిపై చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, కృష్ణుడి వారసుల సామాజిక గౌరవానికి భంగం కలిగించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించి, తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. అయితే ప్రవచనాల్లో ఉదాహరణలు చెప్పడం, పురాణ ఘట్టాలను వివరించడం, దేవతల రూపాలు, అవతారాల ప్రత్యేకతలను విశ్లేషించడం తప్పు కాదు. కానీ ఒక దేవుడి గొప్పతనాన్ని చెప్పేందుకు మరో దేవుడి రూపాన్ని తక్కువ చేసి చూపిస్తున్నామనే భావన కలిగితే మాత్రం సమస్యలు వస్తాయి. భక్తి అనేది పోలికల పోటీ కాదు. ఎవరి ఆరాధ్య దైవం గొప్ప అనే చర్చగా మారితే ఆధ్యాత్మికత వెనుకబడిపోయి వ్యక్తిగత విశ్వాసాలు, ప్రాంతీయ భావోద్వేగాలు ముందుకొస్తాయి.



