దీపావళికి ముందే గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ
Delhi Pollution Crisis: ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టుల కీలక ఆదేశాలు ఇచ్చింది.

Delhi Pollution Crisis: దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య భూతం కమ్మేస్తోంది. దీపావళి పండుగకు ముందే నగరం గ్యాస్ ఛాంబర్‌గా మారిపోతోంది. రోజురోజుకూ పడిపోతున్న గాలి నాణ్యత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 387 పాయింట్లకు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అక్షరధామ్ పరిసర ప్రాంతాల్లోనూ AQI 353 పాయింట్లుగా నమోదైంది. నగరంలోని సగానికి పైగా ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కేంద్రాల్లో రెడ్ అలర్ట్ స్థాయిలో కాలుష్యం నమోదవుతోంది. దట్టమైన కాలుష్య పొరతో ఢిల్లీ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యం.. దీపావళి సమీపిస్తుండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. పండుగ వేడుకల తర్వాత వాయు కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు.. సుమోటోగా విచారణ చేపట్టింది. ఢిల్లీలో చిన్నారుల ఊపిరితిత్తులు సైతం ఆరోగ్యకరంగా లేవని వైద్య నివేదిక పేర్కొన్న విషయాన్ని కోర్టు దృష్టికి అమికస్ క్యూరీ తీసుకెళ్లారు.
పంట వ్యర్థాల దహనంపై కేంద్రం వివరణ
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు అంశాలను వెల్లడించింది. ఈ ఏడాది పంట వ్యర్థాల దహనం ఘటనలు గణనీయంగా తగ్గాయని, ముఖ్యంగా హర్యానాలో భారీగా తగ్గుదల నమోదైందని తెలిపింది. పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండేందుకు రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించింది. పంట వ్యర్థాల నిల్వ కోసం గిడ్డంగుల సదుపాయాలను వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ సూచనలను వ్యవసాయ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తామని కేంద్రం తెలిపింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు డీజిల్‌తో నడిచే రిక్షాలను దశలవారీగా తొలగించే చర్యలు చేపడుతున్నట్లు కేంద్రం కోర్టుకు వివరించింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
ఆంక్షలు విధించినా ఉల్లంఘనలు తప్పడం లేదు..!
వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంక్షలతో కూడిన ఆదేశాలు ఎన్ని ఎక్కువగా జారీ చేస్తే.. ఉల్లంఘనలు కూడా అంతే ఎక్కువగా జరుగుతాయని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. నిబంధనలను ఉల్లంఘించడం ప్రజల సహజ ధోరణిగా మారిందని అభిప్రాయపడ్డారు. దీపావళి వేడుకల్లో భాగంగా వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ సూచించారు. పండుగ కార్యక్రమాల్లో కాలుష్య నివారణపై అవగాహన కల్పించడం కనీస జోక్యమే అవుతుందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణకు ఆధారాలు లేని వాదనలు, వ్యక్తిగత అనుభవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తంగా దీపావళికి ముందే ఢిల్లీ గాలి విషతుల్యంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 387కు చేరిన సగటు AQI.. పండుగ తర్వాత ఇంకెంత ప్రమాదకర స్థాయికి చేరుతుందోనన్న భయం ఢిల్లీ ప్రజలను వెంటాడుతోంది.



