AP State Election Commission: ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నామినేషన్‌ల ప్రక్రియను పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అమలు చేయాలని సూచించింది. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్‌లు వేసేందుకు గడువు ఎక్కవ సమయం లేదని వైసీపీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. పలు చోట్ల నామినేషన్‌లు వేయకుండా అడ్డుకున్నారని .. దాడుల చేశారంటూ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. వైసీపీ పిటీషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఆల్రేడీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌ల గడువు ముగియడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

పుంగనూరు, రాయచోటి, కడప, పులివెందుల, దర్శి సహా పలుచోట్ల నామినేషన్‌లు వేయకుండా అడ్డుకున్నారని.. దీంతో ఎన్నికల సమయం లేక నామినేషన్‌లు వేయలేకపోయామని సుప్రీంకోర్టుకు తెలిపింది వైసీపీ. దాడులకు సంబంధించిన వీడియోలను సైతం సుప్రీం ముందుంచింది వైసీపీ. అన్ని పరిశీలించిన వెంటనే వైసీపీ మద్దతుగా సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో 19చోట్ల నామినేషన్‌లు వేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎస్ఈసీని ఆదేశించింది. అంతేకాదు పోటీ చేసే వైసీపీ అభ్యర్థులకు పోలీసులు భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చింది. అభ్యర్థుల జాబితా ప్రకటన ఈనెల 25కు వాయిదా వేసింది. ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో వాటిని పరిశీలించి .. నామినేషన్‌ల స్వీకరణకు అవకాశం కల్పించాలా వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. అవసరమైతే జిల్లా కలెక్టర్‌ ఎదుట నామినేషన్‌లు వేసే అవకాశం కల్పించాలని సూచించింది. ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలపై అక్టోబర్ 27న తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి తీర్పును ఈనెల 27కు వాయిదా వేసింది.

సుప్రీం తీర్పుపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం అన్నారు. మరోవైపు సుప్రీం తీర్పు తర్వాత ఎన్నికల సంఘం కమిషనర్‌ను వైసీపీ ప్రతినిధి బృందం కలిసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను గుర్తు చేస్తూ.. తీర్పునకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చింది. నామినేషన్‌ వేసేందుకు అభ్యర్థులకు తగిన అవకాశం కల్పించాలని కోరింది. అభ్యర్థులకు రక్షణ కల్పించేలా డీజేపీకి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు సుప్రీం తర్వాత ఎస్‌ఈసీ భేటీ అయింది. 19 స్థానాల్లో ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేపట్టింది. ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా, సెక్రటరీ మల్లిఖార్జున , ఐజీ రాజకుమారి సమావేశం అయ్యారు. ఆయా స్థానాల్లో జరిగిన ఘటనలు, కేసుల అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఎస్‌ఈసీ తీర్పుపై ఉత్కంఠ నెలకుంద.