AP Inter Exams: ఏపీలో 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యుల్ రిలీజ్ అయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు అనౌన్స్ చేసింది. జూనియర్ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 24నుంచి మార్చి 16వరకు జరగనున్నాయి. సీనియర్ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఫైనల్ ఎగ్జామ్స్‌కు ముందు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1నుంచి 15వరకు.. జనరల్ కోర్సుల స్టూడెంట్స్‌కి ఫిబ్రవరి 1నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ఆదివారం మినహా ప్రతీ రోజు ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు నిర్వహిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా తెలిపారు. ఇప్పుడు విడుదల చేసిన షెడ్యూల్ .. తాత్కాలికమని తెలిపారు. ప్రభుత్వ సెలవులు, పండుగలను పరిగణలోకి తీసుకుని తుది షెడ్యూల్ మార్పులు చేసే అవకాశం ఉందని తెలిపారు. స్టూడెంట్స్ తాత్కాలిక షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కావాలని సూచించారు.