ఈ రోజుల్లో ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్స్ బాగా ఊపందుకున్నాయి. ఉదయం టీ తాగడానికి మొదలు, కూరగాయలు తదితర నిత్యవసరాలకు సైతం ఫోన్ పే, గూగుల్ పే, పేటీమ్ ద్వారా నగదు చెల్లించడం సర్వసాధారణమైపోయింది. డిజిటల్ పేమెంట్స్తో పలు రకాల లాభాలు ఉన్నా.. దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకుంటే మాత్రం అంతే స్థాయిలో నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. షాపుల్లో స్కాన్ చేసే ముందు అనేక విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పల్లెలు మొదలుకుని పట్టణాలు, నగరాల వరకూ యూపీఐ టాన్సక్షన్సే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో సైబర్ నేరగాళ్ల దృష్టి ప్రస్తుతం దీనిపై పడింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. దీంతో UPI చెల్లింపుల్లో జరిగే మోసాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై National Payments Corporation of India పలు సూచనలు చేసింది. UPI చెల్లింపులను సురక్షింతంగా చేసేందుకు NPCI కొన్ని చిట్కాలను పాటించాలని సూచించింది. UPI వినియోగదారులు డబ్బును బదిలీ చేయడానికి తరచూ పిన్ని నమోదు చేస్తుంటారు. అయితే ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి ముందు నగదు స్వీకరించే వ్యక్తికి సంబంధించిన UPI IDని క్రాస్ చెక్ చేసుకోవాలని, అక్కడ ఏమాత్రం అనుమానం వచ్చినా పేమెంట్స్ చేయడం ఆపాలని సూచించింది.
ధ్రువీకరణ చేసుకోకుండా ఎవరికీ నగదు చెల్లింపులు చేయొద్దు. మీ యాప్ పిన్ పేజీలో మాత్రమే UPI పిన్ని నమోదు చేయాలి. అలాగే ఈ UPI పిన్ను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఇకపోతే డబ్బు బదిలీ చేయడానికి మాత్రమే క్యూఆర్ కోడ్ను (QR code) స్కాన్ చేయాలి. డబ్బును స్వీకరించడానికి అయితే క్యూఆర్ కోడ్ అవసరం లేదు. ఇక మరీ ముఖ్యంగామీ ఫోన్లో ఎలాంటి స్క్రీన్ షేరింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకోకండి. ఇలా చేయడం వల్ల UPI ID, PIN మొదలైన మీ వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా UPI యాప్ లాక్, ఫింగర్ ప్రింట్, ఫేస్ అథెంటికేషన్ తదితర సెక్యూరిటీ ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఫీచర్లు అనాథరైజ్డ్ పేమెంట్లు జరగకుండా సాయపడతాయి. అంతేకాదు, ఎవరికైనా డబ్బులు పంపేటప్పుడు ఆచితూచి స్పందించాలి.కొన్ని యూపీఐ కోడ్ లు స్కాన్ చేయడం వల్ల మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయి. అందుకే జాగ్రత్తగా డిజిటల్ లావాదేవీలు జరపాలని NPCI చెబుతోంది. వీటిని మీరు కూడా ఖచ్చితంగా పాటించండి.