HomeNewsTalk of The Townసిబిల్ స్కోరు అంటే ఏంటి? ఎలా లెక్కిస్తారో తెలుసా?

సిబిల్ స్కోరు అంటే ఏంటి? ఎలా లెక్కిస్తారో తెలుసా?

Published on

విద్యార్ధులకు మార్కులు, కాంపిటీటివ్ పరీక్షలు రాసినవారికి ర్యాంకులు ఎంత ముఖ్యమో ఈమధ్యకాలంలో మీ క్రెడిట్ స్కోర్ అంతే ముఖ్యం. మీ క్రెడిట్ స్కోరు ఎంత ఉందని అడుగుతుంటాయి వివిధ కంపెనీలు. మీరు వ్యక్తిగత రుణం కావాలన్నా, వాహనాల రుణం, క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా ఇదే ప్రధానం. వేతన జీవికి ‘క్రెడిట్‌స్కోర్‌ప్రాణం. దాన్నిబట్టే.. క్రెడిట్‌కార్డు పరిమితి నిర్ణయం అవుతుంది. బ్యాంకుల నుంచి వివిధ రకాల రుణాలూ మంజూరు అవుతాయి. కాబట్టి, మంచి స్కోర్‌సాధించాల్సిందే. ఆ విషయంలో దేని ప్రభావం ఎంతశాతం ఉంటుందనేది ఒకసారి చూద్దాం.

క్రెడిట్‌స్కోర్‌ను నిర్ణయించడంలో చెల్లింపు చరిత్ర అత్యంత కీలకం. బ్యాంకు వాయిదాలు, క్రెడిట్‌కార్డు బిల్లులు మొదలైనవి ఠంచనుగా చెల్లిస్తున్నారా లేదా అన్నది గమనిస్తారు. ఒక్క లావాదేవీలో వైఫల్యం ఉన్నా ఆర్థిక చరిత్ర మీద మచ్చ తప్పదు.అది 30 శాతం వరకూ ఆధారపడి ఉంటుంది. అంతే మనం చెల్లించగలమా లేదా అనేది నిర్దారిస్తాయి ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు. ఎంత వాడుకున్నారు? మీ క్రెడిట్‌లిమిట్‌ను ఎంతమేర వాడుకున్నారన్నది కూడా ముఖ్యమే. రుణ పరిధి లక్ష రూపాయలు ఉంటే.. అందులో ముప్పై వేల వరకూ ఉపయోగించుకుని ఉంటే ఫర్వాలేదు. అంతకుమించితే , మీ చెల్లింపు సామర్థ్యాన్ని అనుమానిస్తారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని భావిస్తారు.ఇది 15నుంచి 20 శాతం వరకూ ఉంటుంది.

మీ రుణాలు కలగూర గంపలా.. తనఖా రుణం, వాహన రుణం, రెండు క్రెడిట్‌కార్డులు, ఓ వ్యక్తిగత రుణం, ఓ గృహ రుణం- ఇలా రకరకాల అప్పులు ఉన్నట్టయితే మీ‘ క్రెడిట్‌మిక్స్‌’ బ్యాలెన్స్‌గా ఉన్నట్టుగా భావించాలి. ఆరు నెలల నుంచి ఓ ఐదేళ్ళ  కాలంలోనో, పదేండ్ల కాలంలోనో మీ ఆర్థిక చరిత్ర ఎలా ఉందన్నదీ చూస్తారు. అప్పటినుంచీ ఇప్పటిదాకా తీసుకున్న రుణాలు ఏమిటన్నది ఆరా తీస్తారు. చెల్లింపు తీరును గమనిస్తారు, మొండిబాకీలు ఏమైనా ఉన్నాయా అన్నదీ పరిశీలిస్తారు. ఎక్కడా ఏ మచ్చా లేకపోతే స్కోరు పెరిగినట్టే.కొత్త అప్పులు గతం గొప్పగా ఉన్నంత మాత్రాన క్రెడిట్‌స్కోర్‌పెరిగిపోదు. ఈ రోజు, ఈ క్షణం.. నీ ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది బేరీజు వేస్తారు. ఎన్ని బ్యాంకులకు, ఎన్నెన్ని ఆర్థిక సంస్థలకు మీరు అప్పు కోసం దరఖాస్తు చేశారన్నది కూడా లెక్క తేలుస్తారు. ఎన్ని అప్లికేషన్లు పెండింగ్‌లో ఉంటే.. మీరు అన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు. ఈ ఒక్క కారణం చాలు, స్కోరు పడిపోవడానికి. అందుకే మీరు ఎవరైనా అడిగారని మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు ఠకీమని చెప్పేయవద్దు. మీ అప్లికేషన్లు అలా పెండింగులో పడిపోతాయి. ఇతర అంశాలు కూడా.. మీ శాలరీ అకౌంట్‌లోపడే జీతంలో హఠాత్తుగా తగ్గుదల కనిపించినా, అసలే జీతం పడకపోయినా, చాలాకాలం పాటు మీ ఖాతా నుంచి మరొకరి ఖాతాకు భారీ మొత్తం బదిలీ అవుతున్నా మీ ఆర్థిక ప్రయాణంలో ఎత్తు పల్లాలు ఉన్నట్టు బ్యాంకులు భావిస్తాయి. అప్పులు ఇవ్వడానికి వెనకాడుతాయి. మీకు అత్యవసరం అయినప్పుడు ఇలాంటి అంశాలు గుదిబండగా మారిపోతాయి.

సాధారణంగా సిబిల్ స్కోరు కోసం రుణ గ్రహీతల 36 నెలల క్రెడిట్ ప్రొఫైల్ పరిశీలిస్తారు. ఈ ప్రొఫైల్ లో ఇంటిరుణాలు, క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, ఆటోమొబైల్ రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్, అన్ని రకాల రుణాల చరిత్ర ఉంటుంది. ఈక్రెడిట్ చరిత్రకు అనుగుణంగా సిబిల్ స్కోరు లెక్కించడం జరుగుతుంది. సాధారణంగా సిబిల్ స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750 నుంచి 900 మధ్య సిబిల్ స్కోరు ఉంటే అత్యుత్తమం గా భావిస్తారు. అలాగే, 650 నుంచి 750 వరకూ సిబిల్ స్కోరు ఉంటే దానిని మంచి స్కోరుగా, 550 నుంచి 650 మధ్య సిబిల్ స్కోరు ఉన్నవారిని తక్కువ స్కోరుగా భావిస్తారు.

అత్యుత్తమ స్కోర్ కలిగి ఉంటే ఏ రుణమయినా త్వరగా మంజూరు అవుతుంది. అదే మంచి స్కోరు ఉన్నవారికి కూడా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తాయి. తక్కువస్కోరు ఉన్నవారికి ఎలాంటి రుణాలు మంజూరు కావని గ్రహించాలి. అలాగే మీకు క్రెడిట్ కార్డు ఉంటే దానిని ఎడాపెడా వాడేయం కూడా మీ సిబిల్ స్కోరుపై ప్రభావం చూపుతుంది. CUR అంటే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అది 30 నుంచి 40 శాతం మించకూడదు. అంటే మీకు లక్షరూపాయల రుణ పరిమితి కలిగిన క్రెడిట్ కార్డు ఉందనుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు 30 వేల నుంచి 40 వేలకు మించి క్రెడిట్ కార్డు ఉపయోగించకూడదు. అలాగే చెల్లింపులు కూడా బాగుండాలి. ఇలా ఉంటే తక్కువ వడ్డీకి రుణాలు మీకు శాంక్షన్ అవుతాయి.

Latest articles

More like this