ఇప్పుడు ఎక్కడ చూసినా కండ్ల కలక వార్తలే కనిపిస్తున్నాయి. స్కూళ్ళు, కాలేజీల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. భారీవర్షాల కారణంగా కండ్ల కలక వ్యాపిస్తోంది. పాఠశాల విద్యార్థులు కూడా ఇన్ఫెక్షన్తో పోరాడుతున్నారు.ఇటీవల దేశరాజధానిలో ఈ కేసులు బాగా పెరగడంతో ప్రభుత్వం అన్ని ప్రైవేట్ , ప్రభుత్వ పాఠశాలలకు కండ్లకలక వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడే చర్యలను అనుసరించాలని కూడా ఒక సలహాను జారీ చేసింది. పలు ప్రాంతాలలో కూడా పాఠశాలలను తాత్కాలికంగా నిలిపివేశారు. అందువల్ల, ఈ వర్షాకాలంలో మిమ్మల్ని, పిల్లలను సురక్షితంగా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకోసం కొన్ని సూచనలు పాటించాలి.
ఈ దశలతో పిల్లలను కండ్లకలక నుండి రక్షించాలి. మీ పిల్లలకు చేతుల పరిశుభ్రతను ప్రోత్సహించండి. కరోనా టైంలో పాటించిన విధంగా చేతుల్ని శానిటైజ్ చేసుకోమని చెప్పాలి. పాఠశాలకు బయలుదేరే ముందు పిల్లలకు హ్యాండ్ శానిటైజర్ ఇవ్వండి. సబ్బు, నీటితో సరైన హ్యాండ్ వాష్ తో చేతులు శుభ్రం చేసుకునేలా చూడండి. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముఖాలను, ముఖ్యంగా కళ్లను తాకవద్దని పిల్లలకు చెప్పండి.వ్యక్తిగత అంశాలను పంచుకోవడం మానుకోండి: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇద్దరూ న్యాప్కిన్ల వంటి వ్యక్తిగత వస్తువులను పంచుకోవద్దు. కంటి అలంకరణకు దూరంగా ఉండటం, మేకప్ ఉత్పత్తులు, కళ్లకు తగిలే బ్రష్‌లను వాడకపోవడం మంచిది.
కాంటాక్ట్ లెన్స్‌ల వాడకాన్ని తగ్గించండి.స్విమ్మింగ్ పూల్స్, రద్దీ ప్రాంతాలకు పిల్లల్ని వెళ్ళనివ్వకుండా చూడండి. ఒకవేళ కండ్ల కలక వ్యాధి సోకితే అందరికీ దూరంగా ఉండమని చెప్పండి. కండ్లకలక లక్షణాలను వెంటనే గుర్తించడం చాలా ముఖ్యం. ఎర్రటి కన్నుతో పిల్లలను పాఠశాలకు పంపవద్దు. చేతులను శుభ్రంగా ఉంచుకుంటూ, ముఖాన్ని తాకకుండా చూసుకోమని చెప్పాలి. డాక్టర్ సలహాతో మాత్రమే కంటి చుక్కలు వేసుకోవడం మంచిది. అలాగే చేతి రుమాళ్ళు, ఒళ్ళు తుడుచుకునే టవల్స్ కూడా దూరంగా ఉంచి వాడటం మంచిది.ఒకరి దుస్తులు మరొకరు వాడకుండా ఉండాలి. టవల్స్ కూడా ఎవరికి వారు వాడేలా చూడాలి. హాస్టల్స్ ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.