విషాదం నుంచి కొత్త జీవితం వైపు శృతి..
Wayanad Shruthi Marries Sandeep: వయనాడ్‌లో జరిగిన ఈ స్టోరీ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. రెండేళ్ల క్రితం సర్వం కోల్పోయిన శృతి నూతన జీవితంలోకి అడుగు పెట్టింది. వరదల వల్ల తన కుటుంబం కోల్పోయిన శృతికి... సందీప్ కొత్త జీవితాన్ని అందించాడు.

Wayanad Shruthi Marries Sandeep: ఈ ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు శృతి. గురువాయూర్ దేవాలయంలో ఆమె వివాహం చేసుకున్నారు. అయితే, ఆమె వివాహం వెనుక పెద్ద విషాదం దాగి ఉంది. ఇన్నాళ్లూ చెప్పుకోలేని బాధను మనసులో దాచుకుని.. ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగులు వేస్తున్నారు. ఎంతో నవ్వుతూ కనిపిస్తున్న ఈమె జీవితంలో ఎంతటి విషాదం ఉందంటే.. అది మాటల్లో చెప్పలేనిది. ఇంతకీ శృతి జీవితంలో జరిగిన ఆ విషాద సంఘటన ఏమిటి? అసలు ఆమె పెళ్లి వెనుక ఉన్న కథ ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
శృతి జీవితంలో విషాదం నింపిన వయనాడ్ వరదలు
వయనాడ్‌కు చెందిన శృతి కుటుంబం చాలా పెద్దది. తొమ్మిది మంది సభ్యులున్న ఆ కుటుంబం వయనాడ్ కొండల్లో ప్రకృతి అందాల మధ్య నివసించేది. అంతేకాకుండా, శృతికి సమీప బంధువైన జెన్సన్‌తో వివాహం నిశ్చయమైంది. త్వరలోనే శృతి వివాహం జరిపించాలని ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అయితే, 2024లో సంభవించిన ప్రకృతి విపత్తు ఆమె కుటుంబాన్ని బలితీసుకుంది. వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియల కారణంగా శృతి కుటుంబ సభ్యులు, ఆమె చెల్లెలితో సహా మొత్తం తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శృతిని రెస్క్యూ సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటికే కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధతో కుంగిపోయిన శృతికి మరో పిడుగులాంటి వార్త ఎదురైంది. ఆమె కాబోయే భర్త జెన్సన్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో శృతి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తనకు ఎందుకింత కష్టం వచ్చిందంటూ ఆస్పత్రిలో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ తర్వాత బంధువుల ఇంట్లో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని కోలుకుంది. శారీరక గాయాలైతే మానిపోయాయి కానీ.. మనసుకు తగిలిన గాయం మాత్రం అలాగే ఉండిపోయింది.
తోటి ఉద్యోగిని పెళ్లి చేసుకున్న శృతి
వయనాడ్ వరదల్లో సర్వం కోల్పోయిన శృతికి ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఉద్యోగం కల్పించింది. వయనాడ్ కలెక్టరేట్‌లో ఉద్యోగం చేస్తున్న శృతి.. కుటుంబ సభ్యులు, కాబోయే భర్త జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఈ క్రమంలో వయనాడ్ కలెక్టరేట్‌లోనే పనిచేస్తున్న మరో ఉద్యోగి సందీప్.. శృతి గతం గురించి తెలుసుకుని బాధపడ్డాడు. ఆమెకు అండగా నిలిచేందుకు ప్రతిరోజూ శృతితో మాట్లాడటంతో పాటు, విధుల్లోనూ సహాయం చేసేవాడు. ఈ నేపథ్యంలో సందీప్ తన ప్రేమను శృతికి వ్యక్తపరిచాడు. కొన్నాళ్ల తర్వాత శృతి కూడా అతడి ప్రేమను అంగీకరించి పెళ్లికి సిద్ధమైంది. దీంతో సంప్రదాయ పద్ధతిలో బంధువుల సమక్షంలో గురువాయూర్‌లో సందీప్ శృతి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ వివాహ వేడుకకు కేరళ మాజీ మంత్రి రాజన్ ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వయనాడ్ వరదల్లో శృతి తన కుటుంబాన్ని కోల్పోవడం ఎంతో బాధాకరమని, ఇప్పుడు ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి రాజన్ పేర్కొన్నారు.
STORY | Wayanad landslide survivor Shruthi begins new chapter, ties knot at Guruvayur temple
Shruthi, who lost nine members of her family in the 2024 Wayanad landslide and later her fiancé in a road accident, began a new chapter in her life as she married Sandeep at the Guruvayur Sree Krishna Temple on Saturday.
Sandeep, a native of Mananthavady, tied the knot with Shruthi at the temple in the early morning hours in the presence of her surviving relatives, friends and public representatives.
(Full video available on PTI Videos – https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) November 7, 2026
ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాను
వివాహం అనంతరం శృతి, సందీప్ దంపతులు మీడియాతో మాట్లాడారు. తన జీవితంలో జరిగిన విషాదాల గురించి పూర్తిగా తెలిసిన తర్వాతే సందీప్ తనను వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చాడని శృతి తెలిపింది. తామిద్దరం సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నామని, అందరూ తమను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. విషాదం నుంచి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన శృతి ప్రయాణం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2024 జూలైలో వయనాడ్‌లో సంభవించిన కొండచరియల విపత్తులో 150 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘోర విపత్తు సంభవించింది.



