Venugopal Dhoot Declared Bankrupt: దేశంలో మరో ప్రముఖ పారిశ్రామికవేత్త దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్నారు. వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ నందలాల్ ధూత్‌ను దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటిస్తూ ముంబయిలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చిన ఆయన, వాటిని తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. వంద కోట్లు, రెండు వందల కోట్ల రూపాయలు కాదు.. ఏకంగా రూ.12,688 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. SBI నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి వీడియోకాన్ సంస్థ తీసుకున్న రుణాలకు వేణుగోపాల్ ధూత్ వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారు. అయితే, సంస్థ రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకుల బకాయిలు భారీగా పెరిగాయి. అసలు రుణంతో పాటు వడ్డీ, పెనాల్టీలు కలిపి ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి బకాయిలు రూ.12,668.80 కోట్లకు చేరినట్లు బ్యాంకులు పేర్కొన్నాయి. దీంతో తమకు రావాల్సిన రుణాలను వసూలు చేసుకునేందుకు ఎస్‌బీఐ న్యాయపరమైన చర్యలకు దిగింది.

ఆస్తుల స్వాధీనానికి NCLT ఆదేశాలు

వేణుగోపాల్ ధూత్‌ను దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటించాలని, ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటి ద్వారా బ్యాంకుల బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌బీఐ NCLT ముంబయి బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను జ్యుడీషియల్ సభ్యులు వినయ్ గోయల్, చరణ్‌జీత్ సింగ్ గులాటీతో కూడిన ధర్మాసనం విచారించింది. బ్యాంకుల వాదనలను పరిశీలించిన అనంతరం దివాళా ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా వేణుగోపాల్ ధూత్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. దివాళా పరిష్కార ట్రస్టీగా ఆశిష్ నారాయణ్‌ను NCLT నియమించింది. తనకు సంబంధించిన ఆస్తుల పూర్తి వివరాలను ఏడు రోజుల్లోగా ట్రస్టీకి సమర్పించాలని వేణుగోపాల్ ధూత్‌ను ఆదేశించింది. అలాగే, ట్రస్టీ రుణదాతలతో చర్చలు జరిపి 90 రోజుల్లోగా ప్రాథమిక నివేదికను సమర్పించాలని ధర్మాసనం సూచించింది. ఈ ప్రక్రియ ద్వారా వేణుగోపాల్ ధూత్ ఆస్తుల వివరాలను సేకరించి, రుణదాతలకు చెల్లించాల్సిన బకాయిల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు.

2018 నుంచి కొనసాగుతున్న వివాదం

వీడియోకాన్ రుణాల వివాదం 2018 నుంచి కొనసాగుతోంది. వీడియోకాన్ సంస్థ రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో 2018 ఫిబ్రవరిలోనే ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం వేణుగోపాల్ ధూత్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ రుణాల వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసిన వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ కూడా అరెస్టయ్యారు. ఇలా 2018లో ప్రారంభమైన వీడియోకాన్ రుణాల వివాదం తాజాగా వేణుగోపాల్ ధూత్ వ్యక్తిగత దివాళా ప్రక్రియ ప్రారంభానికి NCLT ఆదేశాలు జారీ చేయడంతో మరో కీలక మలుపు తిరిగింది.